పూరి జగన్నాథ్ లైగర్ దెబ్బ నుండి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. లైగర్ నష్టాలూ పూరీని వెక్కిరిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బంది పెట్టడం ఓ ఎత్తు, ఈడీ ప్రశ్నల వర్షం మరో ఎత్తు అన్నట్టుగా పూరి లైగర్ నష్టాల్లో కూరుకుపోయాడు. కొంతకాలంగా మీడియాకి సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న పూరి జగన్నాథ్ తాజాగా తన పాడ్ క్యాస్ట్ లో వాయిస్ ని వినిపించాడు. ఏదో తడ్కా, తాలింపు అంటూ మాట్లాడాడు. కానీ ఆ తడ్కాకి పూరి చెప్పిన అర్ధం విన్నాక పూరీని ఎవడో గట్టిగానే బాధపెట్టాడు అనిపించకమానదు.
చాలామంది జరిగిన విషయం పక్కనబెట్టి దానికి ఏదో ఒక సోది కాదు.. ఎదుటి వారికి మండేలా మంట పెట్టే మాటలతో అవతలి వారికి ఇవతల వారికి గొడవలు పెడుతుంటారు. ఇక్కడ పూరి చెప్పేది అదే. మనం ఒకడిని వేరే వాళ్ళ దగ్గరకి పని మీద పంపిస్తాం. వాడు తిరిగొచ్చాక అక్కడ ఏం జరిగిందో చెప్పమంటాం. కానీ వాడు అక్కడ జరిగింది చెప్పడం మానేసి, వాడు అలా అన్నాడు, ఇలా అన్నాడు, నాకు పిచ్చ కోపం వచ్చింది. అదే నువ్వైతే లాగిపెట్టి కొట్టేవాడివి అని చెప్తాడు. అదంతా ఎందుకు అక్కడేం జరిగిందో స్ట్రయిట్ గా చెప్పమంటాం, అయినా అసలు విషయం చెప్పడు.
ఇంకోసారి వాడిదగ్గరకు నన్ను పంపకు, వాడో వెధవ అని అంటాడు. అసలక్కడ ఏమైందో చెప్పు అంటే డబ్బులిచ్చి పట్టుకెళ్ళమని చెప్పాడు అని చావు కబురు చల్లగా చెబుతారు. అసలు అక్కడ జరిగే విషయం వేరు, వీడు దానిని తాలింపు వేసి కథలు చెబుతాడు, లైఫ్ లో సగం గొడవలు ఆ తడ్కా వల్లే వస్తాయి.. అంటూ పూరి చెప్పడం చూస్తే ఇలాంటి వాడెవడో పూరీని గట్టిగానే ఇబ్బంది పెట్టబట్టే పూరి అలా మాట్లాడాడు అంటూ చాలామంది రకరకాలుగా ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు.