నేడు బుధవారం హీరో విజయ దేవరకొండ ఈడీ ఆఫీస్ కి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ దేవరకొండ లైగర్ మూవీలో నటించడమే అతన్ని ఈడీ విచారణకు హాజరయ్యేలా చేసింది. లైగర్ మూవీ పెట్టుబడుల విషయంలో లైగర్ సినిమాకి సంబంధం ఉన్న ప్రతి వ్యక్తిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్, ఛార్మీలని లైగర్ పెట్టుబడుల విషయంలో ప్రశ్నించిన ఈడీ అధికారులు.. నేడు విజయ్ దేవరకొండని విచారణకు పిలిచారు. ఉదయం 9 గంటలకే విజయ్ సైలెంట్ గా ఈడీ విచారణకు హాజరు కాగా.. 10.30 నిమిషాల నుండి విజయ్ ని ఈడి అధికారులు ప్రశ్నిచడం మొదలు పెట్టారు.
దాదాపు 11 గంటల పాటు విజయ్ ని ఈడీ అధికారులు ప్రశ్నించారు. విజయ్ దేవరకొండని లైగర్ పెట్టుబడుల విషయంలో ప్రశ్నించారు, PMLA సెక్షన్ 50 కింద విజయ్ దేవరకొండ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసారు ఈడీ అధికారులు. లైగర్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే విజయ్ విచారణలో భాగంగా విజయ్ దేవరకొండ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసినట్టుగా తెలుస్తుంది.
అయితే విజయ్ దేవరకొండ విచారణ ముగిసి బయటకు వచ్చిన సమయంలో మీడియా వారు ఏ కేసు కింద విచారణకు హాజరయ్యారని ప్రశ్నించగా, లైగర్ లో నా రెమ్యునరేషన్ గురించి అడిగారు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను, వాళ్ల డ్యూటీ వాళ్ళు చేసారు. మీ ప్రేమ తో వచ్చిన పాపులారిటీ వల్ల కొన్ని ఇబ్బందులు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది లైఫ్ లో ఓ ఎక్స్ పీరియన్స్, ఫేస్ చెయ్యాలి. ఈడీకి కొన్ని అంశాలపై స్పష్టత కావాలి అని చెప్పిన విజయ్ ని మళ్ళీ విచారణకు రమ్మన్నారా అని మీడియా వారు ప్రశ్నించగా మళ్ళీ విచారణకు పిలుస్తాను అని చెప్పలేదు.. అని సమాధానం ఇచ్చాడు విజయ్.