మెగాస్టార్ చిరంజీవి గత కొద్దిరోజులుగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీకి డైరెక్ట్ గానే సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలంటూ ఎంతో కష్టపడుతున్నాడు, అలాంటి వ్యక్తికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి మరోమారు పవన్ కళ్యాణ్ రాజకీయాలపై డైరెక్ట్ కామెంట్స్ చేసారు. చిరంజీవి తాను చదివిన వైఎన్ఎం కాలేజ్ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో తన స్నేహితుల గురించి మాట్లాడిన చిరు తాను ఏదైనా అనుకున్నాను అంటే దానిని సాధించి, దాని అంతు చూసేవరకు నిద్రపోను. కానీ అది నా మనసులోకి రాకపోతే దాని అంతు చూడలేను. అదే నేను అంతు చూడలేని విషయం ఒకటుంది.
అదే రాజకీయాలు. రాజకీయాలంటే మాములు విషయం కాదు. అందుకే వాటి నుండి నేను వెనక్కి వచ్చేసాను. రాజకీయాలంటే ఎదుటి వారిని అనాలి, వారు అన్నది పడాలి. కానీ నేను రెండూ చెయ్యలేను. అక్కడ రాణించడం అనేది చాలా కష్టమైంది. సున్నితంగా ఉండకూడదు. చాలా మొరటుగా, ధైర్యంగా ఉండాలి. అందుకే ఇది నాకవసరమా అని ఎన్నోసార్లు అనుకుని వెనక్కి వచ్చేసాను. కానీ నా తమ్ముడు పవన్ అలాంటివాడు కాదు. అంటాడు, అనిపించుకుంటాడు, పడతాడు.
పవన్ కళ్యాణ్ రాజకీయాలకి తగిన వ్యక్తి అని అనిపించింది.. తను ఏదైనా సరే తెగించగలడు. అలాంటి వ్యక్తికి మీరందరి సహకారం ఉంటుంది. అలాగే మీ ఆశీర్వాదం కూడా ఉండాలి. ఏదో ఒక రోజు పవన్ ను అత్యున్నత స్థానంలో చూస్తాము అంటూ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పై చిరు స్పందించారు.