సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాకైపోయారు. కృష్ణగారి హఠాన్మరణం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న ఉదయం నుండే కృష్ణగారిని చివరి చూపు చూసేందుకు నానక్ రామ్ గూడాలోని కృష్ణగారి నివాసం ముందు బారులు తీరారు. కానీ సెలబ్రిటీస్ తాకిడితో అభిమానులని అనుమతించలేదు. సాయంత్రం నుండి కృష్ణగారి భౌతిక కాయాన్ని చూసేందుకు అభిమానులని అనుమతించినప్పటికీ.. వారు అంతకంతకు పెరుగుతున్నారు తప్ప తగ్గడం లేదు. ఈ రోజు బుధవారం ఉదయం కృష్ణగారి పార్థీవ దేహాన్ని పద్మాలయ స్టూడియోస్ కి తరలించి అభిమానులని అనుమతించారు.
అభిమానులు కిలోమీటర్లు మేర బారులు తీరి కృష్ణగారిని చివరి చూపు చూసేందుకు పోటీపడ్డారు. మధ్యలో ప్రముఖుల రాకతో అభిమానులని ఆపుతుండగా.. వారు తమకి కడసారి చూపు దక్కదని మరింతగా కంగారు పడిపోయి తొక్కేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి వివిధ జిల్లాల నుండి కృష్ణ గారి అభిమానుల రాకతో పోలీస్ లు వారిని అదుపుచేయలేకపోతున్నారు. ఆ తొక్కసలాటలో ఓ అభిమాని తలకి గాయమైనట్టుగా తెలుస్తుంది. కృష్ణగారిని చివరి చూపు చూడకుండానే ఆయన అంతిమ యాత్ర మొదలవుతుంది అన్న వార్తతో అభిమానులు ఒక్కరిగా గేట్లు దాటుకుని ఆయన్ని చూసేందుకు తోసుకోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రముఖులు, మీడియా వారు, అభిమానులు ఇలా అంతా పద్మాలయ స్టూడియోస్ దగ్గర కోలాహలం కనిపిస్తుంది. అభిమానులని అదుపు చెయ్యలేక పోలీస్ లు నానా తంటాలు పడుతున్నారు.