సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఈ రోజు మంగళవారం ఉదయం పరమపదించారు. నిన్న సోమవారం ఉదయం ఆయన కార్డియా అరెస్ట్ తో అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరినప్పుడే.. ఆయన కండిషన్ సీరియస్ అంటూ వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని, కానీ చికిత్సకి కృష్ణ గారి శరీరం స్పందిస్తేనే ఆయన ప్రమాదం నుండి బయటపడతారని చెప్పారు. అయితే మళ్ళీ సోమవారం సాయంత్రానికి కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు.. కృష్ణ గారు ఇంకా క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నారని, ఆయన లివర్, కిడ్నీ ఎఫెక్ట్ అయ్యాయి, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ గా చెప్పొచ్చు.. ఇంకా ప్రమాదకర స్థితిలోనే ఆయన ఉన్నారంటూ అప్ డేట్ ఇచ్చారు. కానీ రాత్రి 7 గంటలకి కృష్ణ గారి ఆరోగ్యం మరింతగా దిగజారిపోయిందని వైద్యులు ప్రకటించారు.
కృష్ణ గారు అపస్మారక స్థితిలోనే హాస్పిటల్‌కు వచ్చారు. ఆయన పరిస్థితి అప్పటికే విషమంగా ఉంది. పలు అవయవాలు పనిచేయలేదు. హైపోక్సిక్ బ్రెయిన్ ఇంజ్యూరీకి గురయ్యారని గుర్తించాం. అందుకోసం ICU లో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు అని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు, వైద్య నీతి పాటించి ఆయన ఎలాంటి బాధపడకుండా మనశ్శాంతిగా వెళ్లిపోయేలా చేశామని, దీనికి కృష్ణ గారి కుటుంబ సభ్యులు అనుమతి ఉంది అంటూ కాంటినెంటల్ వైద్యులు మీడియాకి తెలిపారు. ప్రస్తుతం కృష్ణగారి భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుండి నానక్ రామ్ గూడలోని కృష్ణ గారి స్వగృహం విజయ కృష్ణ నివాసానికి తరలించారు.