తెలుగు సినిమా ఇండస్ట్రీ మరో గొప్పనటుడిని కోల్పోయింది. సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ (79) మంగళవారంవారం తెల్లవారుఝామున 4 గంటలకు మృతిచెందారు. రియల్ స్టార్ కృష్ణంరాజు మరణ వార్త మరువక ముందే.. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ తుది శ్వాస విడవడంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం అర్థరాత్రి నటశేఖర కృష్ణకు కార్డియాక్ అరెస్ట్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనని కాంటినెంటల్ హాస్పిటల్‌కి తరలించారు. కృష్ణను పరిక్షీంచిన డాక్టర్లు.. ఆయన కండీషన్ సీరియస్‌గానే ఉందని ప్రకటించారు. ఐసీయూలో వెంటిలేషన్‌పై ఆయనకి అత్యాధునికమైన చికిత్సను అందిస్తున్నట్లుగా కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు చెబుతూ వచ్చారు. నిపుణులైన డాక్డర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లుగా వారు ప్రకటించినా.. 48 గంటలు గడిస్తేనే కానీ ఏ విషయం చెప్పలేమని తెలిపారు. వారు అలా ప్రకటించిన కొన్ని గంటల అనంతరం కృష్ణ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో.. మంగళవారం వారం ఉదయం 4 గంటలకు ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఆయన మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఒక పెద్దదిక్కుని టాలీవుడ్ కోల్పోయింది.
ధైర్యానికి, సాహసానికి మారు పేరైన కృష్ణకు.. గత కొంతకాలంగా షాకుల మీద షాకులు తగులుతూ వస్తున్నాయి. ఎంతగానో ప్రేమించిన విజయ నిర్మల, పెద్దకొడుకు రమేష్ బాబు, రీసెంట్‌గా భార్య ఇందిరా దేవి ఇలా వరుస మరణాలతో పాటు.. ప్రాణ స్నేహితుడు కృష్ణంరాజు కూడా కాలం చేయడంతో.. కృష్ణ బాగా కృంగిపోయారు. ఆ ప్రభావం ఆయన ఆరోగ్యంపై పడి, ఇప్పుడు ఆయన కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సుమారు 350కి పైగా చిత్రాలలో నటించిన ఈ నటశేఖరుడు.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన బుర్రిపాలెం గ్రామంలో ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు 1943లో మే 31వ తేదీన తొలి సంతానంగా జన్మించారు. చదువుకుంటున్న సమయంలో ఎన్టీఆర్, ఎఎన్నార్ సినిమాలకు ఆకర్షితుడై.. సినిమా ఇండస్ట్రీ వైపు నడిచి.. పలు పాత్రలలో నటించి.. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక పిల్లర్‌గా మారారు.
‘తేనెమనసులు’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన కృష్ణ.. ఆ తర్వాత హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇలా ఎన్నో పాత్రలే కాదు.. తెలుగు సినిమాకి స్కోప్, కలర్, 70ఎంఎం వంటి వాటిని పరిచయం చేశారు. జానపద, చారిత్రక, సామాజిక ఇలా.. ఆయన చేయని జానర్ లేదు. కౌబాయ్, స్పై ఒక్కటేమిటి.. ఆయనొక సినిమా డిక్షనరీ అని చెప్పుకోవచ్చు. వీటన్నింటికి మించి ఆయనొక మంచి మనిషి. మంచితనానికి మారు పేరు. నిర్మాతల శ్రేయస్సును కోరుకున్న హీరో. అలాంటి గొప్ప వ్యక్తిని టాలీవుడ్ కోల్పోవడం బాధాకరం. ఆయన మరణవార్త తెలిసిన వారంతా బాధాతప్త హృదయంతో.. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనో ధైర్యం సిద్ధించాలని కోరుతున్నారు. కృష్ణగారి ఆత్మకు సద్గతి ప్రాప్తించాలని సినీజోష్ కూడా కోరుకుంటోంది.