దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో కథ వేరేగా ఉంటది. ఆయన తీసే సినిమాలు ఒకదానిని మించి ఒకటి అనేలా.. ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నాయి. ‘మగధీర’తోనే రాజమౌళిలోని సృజనాత్మకత ఏంటో.. సినీ ప్రేమికులకు అర్థమైంది. అప్పటి నుండే ఆయనని శిఖరంపై కూర్చోబెట్టారు. ప్రేక్షకులు ఇచ్చిన రెస్పెక్ట్‌ని రాజమౌళి పెంచుకుంటూ వెళ్లాడే తప్ప.. ఎప్పుడూ డిజప్పాయింట్ చేయలేదు. ఆయన సినిమాలపై ఎంత ఊహించుకుని థియేటర్స్‌కి వెళ్లినా.. అంతకు డబుల్ ఎంటర్‌టైన్ చేసి పంపించాడు. అయితే ఇప్పుడు రాజమౌళికి అసలైన పరీక్ష ఎదురుకాబోతోంది. ఎందుకంటే.. ప్రేక్షకులలో సినిమాను చూసే కోణం రోజురోజుకి మారిపోతుంది. వాళ్లని థియేటర్స్‌కి రప్పించడం ఓ సాహసం కింద మారిపోయింది. ఇప్పుడలాంటి సాహసం నేపథ్యంలోనే యాక్షన్ థ్రిల్లర్‌గా రాజమౌళి తర్వాత చేయబోయే చిత్రం ఉండబోతోంది. అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా. దీనిని జక్కన్న ఎలా చెక్కుతాడో? ఎప్పటికి ఫినిష్ చేస్తాడో..? అనే ఉత్కంఠ సినీ ప్రేమికులందరిలోనూ ఉంది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను కూడా ‘బాహుబలి’లా రాజమౌళి రెండు పార్ట్‌లుగా తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. కథకున్న స్పాన్ ప్రకారం.. ఒక పార్ట్‌లో చెప్పడం కష్టమని భావించిన రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఈ సినిమాని రెండు పార్ట్‌లుగా తీసే అంశంపై ఆలోచన చేస్తున్నట్లుగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. నిజంగా ఇది నిజమైతే మాత్రం.. మహేష్ బాబుకి, ఆయన ఫ్యాన్స్‌కి పండగనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే, రాజమౌళితో ఒక్క సినిమా చేస్తే చాలనుకుంటున్న మహేష్‌కి, ఆయన అభిమానులకి.. ఇప్పుడు రెండు సినిమాలంటే.. ఇంక వాళ్లని ఆపడం ఎవరితరం. మరి ఈ వార్తలో ఎంత నిజముందనేది మాత్రం.. మేకర్స్ నుండి స్పష్టత రావాల్సి ఉంది.