దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును, ప్రశంసలను అందుకుంది.. అందుకుంటోంది. రీసెంట్‌గా ఈ సినిమాని జపాన్ దేశంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. జపాన్‌లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం వెళ్లిన చరణ్, తారక్‌లకు భారీ స్వాగతం లభించింది. ఇప్పుడా సినిమాను కూడా అక్కడి ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. ఫలితంగా జపాన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. సినిమా విడుదలైన అతి తక్కువ సమయంలో ఆల్ టైమ్ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా ఆర్ఆర్ఆర్ నిలుస్తోంది.
ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్‌పై క్రేజ్ భారీగా పెరిగింది. ఈ సినిమా చూసిన విదేశీయులు.. సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అది ఈ సినిమా జపాన్‌లో విడుదలకు ఎంతో ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మధ్య అమెరికాలో వేసిన స్పెషల్ షోస్, అక్కడ వచ్చిన రెస్పాన్స్.. ఇలా అన్నీ జపాన్ ప్రేక్షకులను సైతం ఆకర్షించడంతో.. అక్కడి ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం చిత్రం విడుదలైన అతి తక్కువ సమయంలో.. 17 రోజులలోనే అక్కడ రూ. 10 కోట్లు వసూలు చేసినట్లుగా సమాచారం. దీంతో వసూళ్ల పరంగా ఈ చిత్రం టాప్ 3 ప్లేస్‌లోకి చేరుకుంది. అంతకుముందు రజినీకాంత్ ‘ముత్తు’, ‘బాహుబలి’ చిత్రాలు ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా రాజమౌళి ఆశపడిన జపాన్ మార్కెట్.. అతని సొంతమైనట్లుగానే భావించవచ్చు.