వైఎస్ఆర్‌సీపీ మరో కొత్త డ్రామాకు తెరలేపిందా అంటే.. అవునని చెప్పక తప్పదు. ఈసారి డ్రామా ఆర్జీవీతో ఆడించబోతున్నారు. ఇప్పటికే కోడి కత్తి వగైరా వగైరా వాటితో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్‌సీపీ.. మళ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో సరికొత్త ప్లాన్స్‌తో సిద్ధమవుతోంది. బుధవారం సీఎం జగన్ ఆఫీస్ దగ్గర ఆర్జీవీని చూసిన వారందరికీ ఆ డ్రామా ఎలా ఉండబోతుందో అప్పుడే అర్థమైపోయింది కూడా. అదెలా అంటే.. గత ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను డీ గ్రేడ్ చేసేందుకు ఆర్జీవీ సినిమాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి స్కెచ్చే వాడబోతున్నారు. అయితే ఈసారి సినిమా జగన్‌పై.
అవును.. బుధవారం సీఎం జగన్‌తో ఆర్జీవీ దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. ఈ భేటీకి కారణం జగన్‌పై సినిమా అని తెలుస్తుంది. జగన్‌కు అనుకూలంగా ఆర్జీవీ ఓ సినిమా చేయబోతున్నాడట. ‘జగన్నాధ రథచక్రాలు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తోన్న ఈ చిత్రంలో టాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ హీరో నటించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాని వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఓ ఎంపీ నిర్మించనున్నారని సమాచారం. డిసెంబర్‌లో సినిమాని ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే జగన్‌తో ఆర్జీవీ మీట్ అయ్యి.. ఇందులో ఏయే అంశాలు పెడితే.. పార్టీకి కలిసొస్తుందో అని చర్చలు జరిపినట్లుగా టాక్ నడుస్తోంది.