మాస్టర్ డైరెక్టర్ మణిరత్నంకు దక్షిణాదిన ఉన్న పేరు అంతా ఇంతా కాదు. అప్పటి మౌనరాగం మొదలుకొని ఆ మధ్య వచ్చిన సఖి వరకు మణిరత్నం సినిమా అంటే అదో కళాఖండం లాగానే చూసేవారు మన తెలుగులో కూడా. అంబానీ బయోపిక్ గురు తర్వాత ఆ ప్రాభవం తగ్గుతూ వస్తోంది. ఆ తర్వాత వచ్చిన విలన్, కడలి డిజాస్టర్స్ అవడం తో రత్నం కళ తప్పిందనే అభిప్రాయానికి వచ్చేశారు టాలీవుడ్ జనం. ఆ తర్వాత ఒకే బంగారం, నవాబ్ లాంటి చిత్రాలలో తన మెరుపులు అక్కడక్కడ కనిపించినా అవి మణిరత్నం అభిమానులు మురిసిపోవడానికే సరిపోయాయి కానీ కాసులు రాబట్టలేకపోయాయి.
కాస్త గ్యాప్ తీసుకుని తనతో పాటు, తమిళుల డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియిన్ సెల్వన్ తో భారీ తారాగణంతో అత్యంత భారీ బడ్జెట్ తో మణిరత్నం రంగంలోకి దిగారు. అదే పేరుతో తమిళ నాట అత్యంత ప్రాచుర్యం కలిగిన కల్కి కృష్ణమూర్తి రచించిన అయిదు భాగాల పుస్తకాన్ని, రెండు భాగాల సినిమాగా రూపొందించేందుకు సిద్ధమయ్యారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాతగా తన ఆస్థాన సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ సంగీతంతో విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తి, జయం రవి లాంటి స్టార్స్ తో తీసిన పి ఎస్ 1 సెప్టెంబర్ 30న ప్రపంచమంతా విడుదలయ్యింది.
తొలి ఆట నుండే తమిళ వెర్షన్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోగా, మిగిలిన భాషల్లో డివైడ్ టాక్ తో రన్ అయింది. తమిళ్ తర్వాత మలయాళం లో మంచి కలెక్షన్స్ సాధించిన ఈ కావేరి పుత్రుడు ( పోన్నియిన్ సెల్వన్) మిగిలిన చోట్ల పెద్ద ప్రభావం చూపలేకపోయాడు. కానీ తమిళనాడు లో మాత్రం కనీవినీ ఎరుగని వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా అమెరికా, మలేసియా, శ్రీలంక లాంటి దేశాల్లో నంబర్ 1 తమిళ చిత్రం గా చరిత్ర సృష్టించింది. మొత్తంగా పొన్నియిన్ సెల్వన్ 19 రోజులకీ ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల రూపాయలు కొల్లగొట్టి 500 కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తోంది. తమిళులకు ఈ కథ గురించి పూర్తి అవగాహన ఉండటం, వారు ఎంతో ఉన్నతంగా భావించే చోళుల చరిత్ర అవడం, వారి అభిరుచికి అనుగుణంగా మణిరత్నం ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడం వంటి కారణాలతో పొన్నియిన్ సెల్వన్ బాక్స్ ఆఫీస్ వద్ద జయకేతనం ఎగురవేశాడు. ఇప్పటి నుండే రెండవ భాగం మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.