ప్రపంచ అత్యంత అందగత్తెలలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోయిన్‌కు ఛాన్స్ దక్కింది. ప్రపంచంలోని అత్యంత అందమైన 10 మంది మహిళల జాబితాలో ఆమెకు టాప్ 10లో చోటు లభించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా? ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ K’ చిత్రంలో చేస్తున్న దీపికా పదుకొనె. ‘ది గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫై’ పేరుతో విడుదలైన ఈ జాబితాలో భారతదేశం తరపున ఆమెకు అగ్రస్థానం లభించింది. జోడీ కమర్ ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా ఈ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకోగా, దీపికా పదుకొనెకు 9వ స్థానం లభించింది.
ఈ జాబితా కోసం ఎంపికైన వారి ఫేస్‌లోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని తెలుస్తుంది. ఈ లెక్కన దీపికా 91.22 శాతం గోల్డెన్ రేషియో సంపాదించింది. ఆమెతో పాటు అరియానా గ్రాండేకు 91.81, టేలర్ స్విఫ్ట్‌కు 91.64, కిమ్ కర్దాషియాన్‌కు 91.28, బియన్స్‌కు 92.44 రేషియో వచ్చినట్లుగా ‘ది గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫై’ ప్రకటించింది. దీంతో ప్రపంచ అందగత్తెలలో ఒకరైన దీపికాతో ప్రభాస్ రొమాన్స్ చేయబోతున్నాడంటూ.. ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ‘ప్రాజెక్ట్ K’ పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతుండగా.. ఇంకా షారుఖ్, సిద్దార్థ్ ఆనంద్, హృతిక్ రోషన్ వంటి వారి చిత్రాలలో ఆమె నటిస్తోంది. ప్రస్తుతం ఈ జాబితాలో దీపికా పేరు ఉండటంతో.. భారత్ తరపున ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.