‘అఖండ’, ‘పుష్ప’, ‘కెజిఎఫ్ 2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘విక్రమ్’.. ఈ మధ్యకాలంలో భారీ విజయం సాధించిన చిత్రాలు. ఒక్కసారి వీటిని గమనిస్తే.. వరుసగా యాక్షన్, డ్రామా, ఎమోషన్స్‌తో ఇండస్ట్రీ హీటెక్కిపోయింది. మధ్యలో ‘మేజర్’, ‘సీతారామం’, ‘బింబిసార’, ‘కార్తికేయ 2’ కాస్త కూల్ చేసే ప్రయత్నం చేసినా.. ఒక్కటి మాత్రం తగ్గింది. ‘ఒక్కటి తగ్గింది పుష్ప’ డైలాగ్‌లా.. హిట్టొస్తున్నా.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే విషయంలో ఒక్కటి తగ్గింది. ఆ ఒక్కటీ ఏంటో.. జస్ట్ టీజర్‌తో చూపించాడు అల్లు వారబ్బాయి అల్లు శిరీష్. ఆ తగ్గింది ఏంటో కాదు.. రొమాన్స్. వాస్తవానికి ‘పుష్ప’లో అల్లు అర్జున్, రష్మికలు వర్కవుట్ చేయాలని చూశారు కానీ.. ఖర్చవుతుందంటూ జస్ట్ అలా ముగించేశారు.. ఆ తర్వాత అంతా డ్రామా, యాక్షనే. రీసెంట్‌గా వచ్చిన కొన్ని చిత్రాలలో రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నా.. ఇండస్ట్రీ మూడ్‌ని మార్చే రేంజ్‌లో అయితే లేవనే చెప్పుకోవాలి. కానీ, జస్ట్ టీజర్‌తోనే ఇండస్ట్రీ మూడ్‌ని మార్చేశాడు అల్లు శిరీష్.
అల్లు శిరీష్ హీరోగా హాట్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. ‘విజేత’ దర్శకుడు రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌లో అల్లు శిరీష్, అనుల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు.. ముఖ్యంగా ముద్దు సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అవే.. ఈ టీజర్ గురించి, ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. అంతేకాదు, గత కొంతకాలంగా ఇండస్ట్రీ వెళుతున్న మూడ్‌ని కూడా మార్చాయంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరి ఈ ముద్దులు ఈ అల్లు వారబ్బాయికి ఏ మాత్రం హిట్‌ని ఇస్తాయో చూడాలి.