హిట్టు, ఫట్టు అనేది పక్కన పెడితే.. నటుడన్నాక అన్ని జానర్స్‌లో నటించాలి.. నవరసాలను పలికించాలి. అప్పుడే నటుడిగా కొన్నాళ్లపాటు ప్రేక్షకులలో నిలిచిపోతారు. కొందరు నటులు భూమి మీద లేకున్నా.. వారి పేరు ఇంకా వినబడుతుందంటే అదే కారణం. కానీ, అందరికీ అన్ని జానర్స్ నప్పవు. ఒక్కో జానర్.. ఒక్కో హీరోకి బలం అన్నట్లుగా ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. కానీ, కొందరు హీరోలు ముఖ్యంగా ఇప్పుడొస్తున్న కుర్రహీరోలు వారి బలాన్ని గుర్తించకుండా కలంటూ.. కొన్ని పాత్రలు చేసి చేతులు కాల్చుకుంటున్నారు. వారు ఎన్నుకున్న పాత్రల కోసం ఎంత కష్టపడినా.. పాపం వారికి అస్సలు అదృష్టం కలిసి రావడం లేదు. ఇక కుర్ర హీరోలే కాదు.. ఏ హీరో అయినా సరే.. నటుడయ్యాక చేయాలనుకునే పాత్రలలో పోలీస్ అధికారి పాత్ర కూడా ఒకటి. సీనియర్ హీరోలెందరో ఖాకీ చొక్కా వేసుకుని కదం తొక్కారు. కానీ ఇప్పుడొస్తున్న కుర్ర హీరోలకు మాత్రం ఆ ఖాకీ చొక్కా.. ఖంగుతినే రిజల్ట్‌ని ఇవ్వడమే కాకుండా.. కలలో కూడా మళ్లీ అటు వైపు వెళ్లే ఆలోచన లేకుండా చేస్తుంది.
స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజశేఖర్ వంటివారు ఖాకీ చొక్కాలలో కనిపించి.. సక్సెస్‌లను సొంతం చేసుకున్నారు. ఖాకీ చొక్కా వారికి బ్లాక్‌బస్టర్ విజయాలని ఇచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో ఖాకీ చొక్కా ధరించి.. కుర్రహీరోలు డ్యూటీ చేస్తుంటే.. ప్రేక్షకులకు అస్సలు నచ్చడం లేదు.. ఫలితంగా భారీ డిజాస్టర్స్ వారి ఖాతాలో నమోదవుతున్నాయి. అందుకు ఇటీవల వచ్చిన రామ్ ‘ది వారియర్’, కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్’, శర్వానంద్ ‘రాధ’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘కవచం’, ఆది సాయికుమార్ ‘తీస్ మార్ ఖాన్’, సాయి ధరమ్ తేజ్ ‘నక్షత్రం’, సుధీర్ బాబు ‘వి’, రీసెంట్‌గా వచ్చిన శ్రీవిష్ణు ‘అల్లూరి’ చిత్రాలన్నీ ఈ ఖాకీ బ్యాక్‌డ్రాప్‌లోనే వచ్చి.. వారికి తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ సినిమాల కోసం వారు ఎంతో కష్టపడ్డా.. ఫలితం మాత్రం వారు ఊహించిన విధంగా మాత్రం రాలేదు. వారిని పవర్‌ఫుల్ ఆఫీసర్స్‌గా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదు.
సో.. దీనిని బట్టి కుర్ర హీరోలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. వారికి ఏ జానర్ కరక్టో.. ఎందులో వారు బలంగా నటించగలరో.. అలాంటి వాటిని చూజ్ చేసుకుంటే బెటర్. నటన పరంగా వారికి వంక పెట్టడం లేదు కానీ.. ప్రేక్షకులు తమని ఎలాంటి పాత్రలలో చూడాలని అనుకుంటున్నారో గమనించి.. ఆ వే లో వెళితే బాగుంటుంది. అంతే తప్ప, అవకాశం వచ్చిందనో.. మాస్, దమ్మున్న డైరెక్టరనో.., మాస్ హీరో ఇమేజ్ కోసమో సినిమాలు చేస్తే.. రిజల్ట్ వారు ఊహించని విధంగా వస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకుని మసులుకుంటే కొన్నాళ్లపాటు తిరుగుండదు. కాదు, కూడదని అంటారా.. కళ్లు తెరిచే సమయానికి వారి చేతుల్లో కానీ.. చేయడానికి కానీ ఏమీ ఉండదు. అది మ్యాటర్.