క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’. అక్టోబర్ 5న దసరా స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే అదే తేదీన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమా కూడా విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. దీంతో చిరు-నాగ్‌ల ఫైట్‌పై ఇండస్ట్రీలో ఆసక్తికరంగా చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే, ఇద్దరూ అన్నదమ్ముల మాదిరిగా ఉంటారు. అలాగే కలిసి బిజినెస్‌లు చేస్తుంటారు. ఒకరంటే మరొకరికి విపరీతమైన ఇష్టం. అలాంటి వారి మధ్య ఫైట్ అంటే నిజంగానే ఆసక్తి ఉంటుంది. ఇప్పుడా ఆసక్తే.. వీరిద్దరూ చేస్తున్న సినిమాలకు భారీ క్రేజ్ తీసుకొస్తుంది. విడుదల తర్వాత ఎవరు బాక్సాఫీస్ కింగ్ అవుతారనేది పక్కన పెడితే.. ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా దూసుకుపోతున్నారు.
కింగ్ ‘ది ఘోస్ట్’ సినిమా ఫంక్షన్‌ని కర్నూలులోని ఎస్టీబిసి గ్రౌండ్‌లో ప్లాన్ చేస్తే.. చిరు ‘గాడ్‌ఫాదర్’ ప్రీ రిలీజ్ వేడుకను అనంతపురంలోని జేఎన్‌టీయూ గ్రౌండ్‌లో ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 25న ‘ది ఘోస్ట్’, సెప్టెంబర్ 28న ‘గాడ్‌ఫాదర్’ వేడుకలను చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమయ్యాయి. ముందుగా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘గాడ్‌ఫాదర్’కు సెన్సార్ నుండి యుబైఏ సర్టిఫికెట్ వచ్చింది. తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న కింగ్ ‘ది ఘోస్ట్’కి కూడా సేమ్ టు సేమ్ సెన్సార్ నుండి యుబైఏ సర్టిఫికెటే రావడం విశేషం. దీంతో.. ఈ రెండు సినిమాలపై మరింత ఆసక్తి క్రియేట్ అవుతోంది. సెన్సార్ సభ్యులు కూడా రెండు సినిమాలపై ఒకే విధంగా స్పందించినట్లుగా తెలుస్తోంది.