నిన్న ఏపీ అసెంబ్లీలో విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మారుస్తూ ఓ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. టీడీపీ నేతలు, అధ్యక్షడు చంద్రబాబు కూడా ఎన్టీఆర్ పేరు మార్పుని తీవ్రంగా ఖండించారు.. అయితే ఎన్టీఆర్ పేరు మార్చే విషయంలో నందమూరి ఫ్యామిలీ నుండి రామ కృష్ణ స్పందించారు. ఎన్టీఆర్ పేరుని మార్చి వైఎస్సార్ యూనివర్సిటీ గా ఎలా పెడతారంటూ ఆయన ధ్వజమెత్తారు.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయమై స్పందించారు. NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాధారణ సాధించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు. NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో ఆయన స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు అంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.