‘బాహుబలి 2’ సినిమాలో ఓ డైలాగు ఉంటుంది. ‘వీడు ఎక్కడున్నా రాజేరా’ అని నాజర్ చెప్పే డైలాగ్. అలాగే రెబల్‌స్టార్ కృష్టంరాజు పేరుకే కాదు.. పర్సనాలిటీకి, మానవత్వం ప్రదర్శించడంలోనూ.. ఇలా ప్రతి విషయంలోనూ ఆయన కింగ్ అనే అనిపించుకున్నారు. ఆయన చనిపోయే వరకు కూడా సినిమా ఇండస్ట్రీకి పెద్దన్నగా ఉన్నారు. ఆయన ఓకే అంటేనే ‘మా’ ఎన్నికలు జరిగాయి. సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఆయన మార్గం ఆచరణీయం. ఈ మధ్య ఇండస్ట్రీలో షూటింగ్స్ బంద్ చేసి.. బడ్జెట్ విషయంలో ప్రక్షాళనలు మొదలెట్టారు.. కానీ, ఒక్క కృష్ణంరాజుని ఉదాహరణగా చూపిస్తే సరిపోయేది. ఎందుకంటే.. ఆయన షూటింగ్స్‌లో ఉండగా.. ఆయనకి అయ్యే ఖర్చు మొత్తం రెమ్యూనరేషన్‌లో తగ్గించుకుని ఇవ్వమని చెప్పేవారట. రెమ్యూనరేషన్ కాకుండా ఒక్క రూపాయి కూడా అదనంగా నిర్మాత నుండి ఆయన తీసుకునేవారు కాదట.
ఓ సారి షూటింగ్‌లో ప్రొడక్షన్ బాయ్‌ని జ్యూస్ తీసుకొచ్చి పెట్టమని అడగగా.. అలాంటివి ఇక్కడ కుదరని, అందుకు అనుమతి లేదని ప్రొడక్షన్ మేనేజర్ బదులిస్తే.. వెంటనే ఆయనే లేచి వెళ్లి జ్యూస్ తాగి వచ్చేందుకు రెడీ అయ్యారట. ఇంతలో నిర్మాత పరుగుపరుగున వచ్చి.. మీరు కూర్చోండి నేను తెప్పిస్తాను అని చెప్పారట. వెంటనే కృష్ణంరాజు, నేను షూటింగ్‌లో ఉండగా.. ఏది అడిగినా ప్రొవైడ్ చేయాల్సిందే. అందుకు అయ్యే ప్రతి రూపాయిని నా రెమ్యూనరేషన్‌లో తగ్గించుకోండి.. అని నిర్మాతకు చెప్పారట. అప్పటి నుండి ఆయన రెమ్యూనరేషన్ అలాగే తీసుకునే వారట. ఈ విషయం విఠాలాచార్య అప్పట్లో ఓ స్టేజ్‌పైనే చెప్పి.. కృష్ణంరాజుగారిలా ఉంటే.. నిర్మాతలందరూ సేఫ్‌గా ఉంటారని ఆయనపై పొగడ్తలు వర్షం కురిపించారు. ఆ తర్వాత కొందరు నిర్మాతలు ఇతర నటీనటుల విషయంలో కూడా కృష్ణంరాజు మార్గాన్నే అనుసరించారు. ఇక కృష్ణంరాజు ఇంటి నుండి క్యారేజ్ వస్తుందంటే.. అప్పుడైనా, ఇప్పుడైనా ఓ 20 మందికి రుచికరమైన వంటలతో కడుపునిండిపోయినట్లే. అంత గొప్పమనసు కృష్ణంరాజుది. అందుకే ఆయన ఎప్పటికీ కింగే.