ఆదివారం తెల్లవారి ఝామున గుండెపోటుతో కన్ను మూసిన టాలీవుడ్ లెజెండ్రీ ఆక్టర్ కృష్ణం రాజు గారి భౌతిక కాయాన్ని సినీ రాజకీయ ప్రముఖులు సందర్శించి ఆయనకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులని ఓదారుస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి టీఆరెస్ మంత్రులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, చిరు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ వరకు ప్రతి ఒక్కరూ జూబ్లీహిల్స్ లోని కృష్ణం రాజు ఇంటికి వెళ్లి ఆయనకి నివాళు అర్పించారు. అయితే ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం కి తరలిస్తారని అన్నప్పటికీ.. కృష్ణం రాజు భౌతిక కాయాన్ని ఆయన నివాసంలోనే రేపు అంత్యక్రియలు జరిగే వరకు ఉంచుతారట.
అంతేకాకుండా రేపు సోమవారం మధ్యాన్నం హైదరాబాద్ లోని మహా ప్రస్థానంలో కృష్ణం రాజు గారి అంత్యక్రియలు జరుగుతాయని ప్రచారం జరిగినా.. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు రేపు మధ్యాహ్నం 1గంటలకు చేవెళ్ల, మొయినాబాద్ దగ్గర కనకమామిడి ఫామ్ హౌస్ లో కృష్ణం రాజు గారి అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించే ఏర్పాట్లు చూడాలంటూ అధికారులని ఆదేశించిన విషయం తెలిసిందే. రేపు మధ్యాన్నం మొయినాబాద్ దగ్గర కనకమామిడి ఫామ్ హౌస్ లో కృష్ణం రాజు గారి అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరగనున్నాయి.