రెబల్ స్టార్ కృష్ణంరాజుకి, మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వారిద్దరూ ఒకే ఊరికి చెందిన వారు. కెరీర్ మొదట్లో ఇద్దరూ విలన్ పాత్రలలో నటించారు. ఒకరంటే ఒకరికి ఎనలేని అభిమానం. చిరంజీవి పీఆర్పీ అనే రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కూడా కృష్ణంరాజు ఆ పార్టీలో చేరి చిరంజీవికి సపోర్ట్ అందించారు. ఇప్పటికీ వారి ఫ్యామిలీల మధ్య మంచి అనుబంధం ఉంది. కెరీర్ తొలిరోజుల నుంచి పెద్దన్నలా ప్రోత్సహించిన కృష్ణంరాజు లేరనే వార్తని చిరంజీవి జీర్ణించుకోలేకపోతున్నారు. ట్విట్టర్ వేదికగా కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని తెలియజేసిన చిరంజీవి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
‘‘శ్రీ కృష్ణంరాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం! మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలిరోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది.
ఆయన ‘రెబల్ స్టార్’కి నిజమైన నిర్వచనం. కేంద్రమంత్రిగా కూడా ఎన్నో సేవలందించారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకూ, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు లాంటి ప్రభాస్‌కీ నా సంతాపం తెలియచేసుకుంటున్నాను!’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.