పవన్ కల్యాణ్- ‘సాహో’ దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘థేరి’ చిత్రం రీమేక్ కాబోతున్నట్లుగా సోమవారం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. గతంలో పవన్ కల్యాణ్ సినిమా చూసి.. బయటికి వస్తూ.. ‘జై పవర్ స్టార్’ అంటూ సుజీత్ అరుస్తున్న వీడియోని వైరల్ చేస్తూ.. మరోసారి ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉండబోతుందో అనేలా నెటిజన్లు, పవన్ ఫ్యాన్స్ వార్తలను వైరల్ చేశారు. ఈ సినిమాని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి నిర్మించబోతున్నట్లుగా కూడా వైరలైన వార్తలలో తెలిపారు. మాములుగా అయితే.. పవన్ రీమేక్ సినిమాల విషయంలో నిట్టూర్చే ఫ్యాన్స్ కూడా.. సుజీత్ అనే సరికి సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ.. బ్లాక్‌బస్టర్ లోడింగ్ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.
అయితే ఈ ప్రాజెక్ట్‌పై నిర్మాత డివివి దానయ్య క్లారిటీ ఇచ్చారు. అదొక గాసిప్‌గా ఆయన కొట్టిపారేశారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ అఫీషియల్ ట్విట్టర్ వేదిక ద్వారా స్పందిస్తూ.. ‘‘మా సంస్థలో మేము చేయబోయే ఏ ప్రాజెక్ట్‌కి సంబంధించిన సమాచారమైనా.. మేమే అధికారికంగా తెలియజేస్తాము. దయచేసి ఎటువంటి రూమర్లని నమ్మవద్దు’’ అంటూ తెలియజేశారు. సో.. పవన్-సుజీత్ కాంబినేషన్‌లో సినిమా కష్టమే అనేది తేలిపోయింది. అయినా.. పవన్ కల్యాణ్ కమిటైన సినిమాలు మూడు లైనులో ఉన్నాయి. వాటిని పూర్తి చేయకుండా.. కొత్తగా ఈ ప్రాజెక్ట్ ఎలా తెరకెక్కుతుందో అనేది ఆల్రెడీ చెప్పుకోవడం కూడా జరిగింది. ఇప్పుడదే నిజమైంది. నిర్మాత నుండి క్లారిటీ వచ్చింది కాబట్టి.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కాస్త.. ఊపిరి పీల్చుకోండి. అన్నిటినీ నమ్మేస్తూ.. చిన్న చిన్న విషయాలను కూడా వైరల్ చేయడం కాస్త మానుకోండి అంటూ.. ఇప్పుడు ఫ్యాన్స్‌పై కామెంట్స్ పడుతున్నాయి.