మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా ఓ వేదికపై తన తండ్రి పేరిట చిత్రపురి కాలనీలో ‘హాస్పిటల్’ను నిర్మించబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఆయన ఈ ప్రకటన చేశారో.. ఇప్పుడంతా ‘మా’ భవనం గురించి మాట్లాడుకుంటుండటం విశేషం. గత ‘మా’ ఎన్నికలలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు బిల్డింగ్ నిర్మిస్తామంటూ పోటీ చేసిన రెండు ప్యానల్స్ వారు తమ అజెండాలో పేర్కొన్నారు. ‘మా’ ఎన్నికలు ముగిసి దాదాపు సంవత్సరం కావస్తోంది. ఇంత వరకు ‘మా’ భవనంకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ తెలియరాలేదు. మధ్యలో ‘మా’ ప్రెసిడెంట్ మూడు స్థలాలు చూసి వస్తున్నానంటూ.. ఓ వీడియోని పెట్టడం తప్ప.. తర్వాత కామ్‌గానే ఉండిపోయాడు. ‘మా’ బిల్డింగ్ కడితే.. నేను కూడా కొంత అమౌంట్ ఇస్తానని నటసింహ బాలయ్య కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు. ఆయన కూడా ఈ విషయంపై కామ్‌గానే ఉన్నారు. ఏడాది గడిచింది.. అసలు ఈ టర్మ్‌లో అయినా ‘మా’ భవనం పూర్తవుతుందో లేదో.. అనేలా కొందరు సెలబ్రిటీలు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి నేపధ్యంలో.. చిరు నుంచి హాస్పిటల్ ప్రకటన రాగానే.. ‘మా’ భవనం గురించి కూడా వార్తలు హైలెట్ అవుతున్నాయి. ఈ పుట్టినరోజుకు అనౌన్స్‌మెంట్.. రాబోయే పుట్టినరోజుకి హాస్పిటల్‌లో సేవా కార్యక్రమాలు మొదలు అన్నట్లుగా కరెక్ట్‌గా సంవత్సరం టైమ్‌ని చిరు కేటాయించడం చూస్తుంటే.. ఇది గత ‘మా’ ఎన్నికలలో గెలిచిన వారికి కౌంటర్ అనేలానే అంతా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే.. గెలిచిన ‘మా’ ప్రెసిడెంట్ పదవీ కాలం కూడా ఇంకా సంవత్సరమే ఉంది. ఇప్పటి వరకు అసలు ఆచరణలోకే తీసుకురాని బిల్డింగ్ వ్యవహారం.. ఈ సంవత్సరంలో పూర్తవుతుందా? అలాంటప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకు? అనేలా కొందరు అప్పుడే కామెంట్స్ కూడా స్టార్ట్ చేశారు. ఈ కదలికకు కారణం మాత్రం చిరూనే. మరి ఈ వ్యవహారంపై ‘మా’ అధ్యక్షుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.