చిరంజీవి మెగాస్టార్ కాక ముందు.. ఆయన పేరు ‘సుప్రీం హీరో చిరంజీవి’ అని టైటిల్ కార్డ్స్‌లో పడేది. ఇది 80స్ బ్యాచ్‌కి బాగా తెలిసిన పేరు. ‘ఖైదీ’ తర్వాత చిరంజీవి ఇండస్ట్రీకి హీరోయిజాన్ని సరికొత్తగా ప్రజంట్ చేయడంతో పాటు, ఆ తర్వాత ఆయన చేసిన చిత్రాలు టాలీవుడ్ రూపురేఖలని మార్చేశాయి. ‘మరణమృదంగం’ చిత్రానికి నిర్మాత కె.ఎస్. రామారావు.. ఆ చిత్ర టైటిల్ కార్డ్స్‌లో చిరంజీవికి ముందు ‘మెగాస్టార్’ని చేర్చారు. అది అందరికీ నచ్చింది. అదే ఇప్పుడు చిరంజీవికి ఇంటి పేరుగా మారింది. ఇక మెగాస్టార్‌కి ముందు ట్యాగ్ అయిన ‘సుప్రీం హీరో’ని ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ మధ్య తన పేరు ముందు వాడుకుంటున్నాడు. ఆ ట్యాగ్‌ని తన పేరు ముందు ఎందుకు పెట్టుకుంటున్నాడో.. తాజాగా జరిగిన ‘మెగా కార్నివాల్’లో తేజ్ చెప్పుకొచ్చారు.
‘‘నా ధైర్యం మా మామయ్య. సుప్రీం హీరో అని ఎందుకు పెట్టుకున్నానో తెలుసా. మీకు అనిపించవచ్చు. వీడు సుప్రీం హీరో ఏంట్రా? అని. దీని వెనుక చిన్న స్టోరీ ఉంది. ఈ ఐదు వేళ్లు ఈ రోజు అన్నం ముద్ద కలిపి నా నోట్లోకి వెళుతున్నాయంటే.. దానికి కారణం మా మామయ్య. కామన్‌గా అందరూ చెబుతారు.. కానీ ఇది నిజం. హిట్టొచ్చినా.. ఫ్లాప్ వచ్చినా.. నేను ఎంత ఎత్తుకు ఎదిగినా.. అండగా నేనున్నానంటూ ధైర్యం ఇచ్చేలా ఉంటుందనే ‘సుప్రీం హీరో’ అని నా పేరు ముందు పెట్టుకున్నాను. ఆయన పేరు నాతో పాటు ఉండాలని చిన్న కోరిక. అందుకోసమే ఆ పేరు నా పేరు ముందు పెట్టుకున్నాను. ఆ ట్యాగ్ ఉంటే.. ఆయన నాతో పాటు ఉంటారని.. నేనే ఆ పేరు పెట్టుకున్నా. అది నాకు ఎప్పటికప్పుడు బాధ్యతని తెలియజేస్తూ ఉంటుందనే అలా పెట్టుకున్నా..’’ అని తేజ్.. ఆ పేరు పెట్టుకోవడానికి గల కారణాన్ని తెలిపారు.