Advertisement
Google Ads BL

చిరుకు పవన్ బర్త్‌డే విష్.. అస్సలు తగ్గలే!


‘‘తాను కలవబోయే వ్యక్తి ప్రతి నమస్కారం కూడా చేయలేని కుసంస్కారి అయినప్పటికీ.. తను చేతులెత్తి నమస్కరించే సంస్కారం అన్నయ్య చిరంజీవిగారి సొంతం. వయసు తారతమ్యాలు.. వర్గ వైరుధ్యాలు.. కులమతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకొనే విశాల హృదయుడు అన్నయ్య చిరంజీవి’’ అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని.. ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో..

Advertisement
CJ Advs

 

‘‘మనసున్న మారాజు అన్నయ్య శ్రీ చిరంజీవిగారు

అన్నయ్య.... తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదం. ఎందుకంటే నేను ఆరాధించే చిరంజీవిగారిని పిలవడమే కారణమేమో. ఆయనను అన్నయ్యా అని పిలిచినప్పుడల్లా అనిర్వచనీయ అనుభూతి కలుగుతుంది. అటువంటి అన్నయ్యకు జన్మదిన సందర్భంగా మనసా వాచా కర్మణా అనురాగపూర్వక శుభాకాంక్షలు. శ్రీ చిరంజీవిగారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి నాలుగు మాటలు ఏం చెప్పాలంటే ఒకింత కష్టమే. ఎందుకంటే – ఆయన జీవితం తెరిచిన పుస్తకం. ఆయన ఇంతవాడు అంతవాడైన విషయం చెప్పాలా... ఆయన సాధించిన విజయాలు గురించి చెప్పాలా... ఆయన సినిమాల్లో సాధించిన రికార్డుల గురించి చెప్పాలా.. ఆయన అధిరోహించిన పదవుల గురించి చెప్పాలా... ఆయన కీర్తిప్రతిష్ఠల గురించి చెప్పాలా... ఆయన సేవాతత్పరత గురించి చెప్పాలా.... ఇవన్నీ తెలుగు వారందరితోపాటు యావత్ భారత దేశమంతటికీ సర్వ విదితమే. అయితే అన్నయ్యలోని గొప్ప మానవతావాది గురించి చెప్పడమే నాకు ఇష్టం. దోసిట సంపాదిస్తే గుప్పెడు దానం చేయాలనే ఆయన జీవన విధానాన్ని ఎంత పొగిడినా తక్కువే. చమటను ధారగా పోసి సంపాదించిన సొమ్ము నుంచి ఎందరికో సహాయం చేశారు. పేదరికంతో బాధపడుతున్నా... అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనా లేదా చదువులకు దూరమైన వారి గురించి ఎవరి ద్వారా తెలిసినా తక్షణం స్పందించి సాయం చేసే సహృదయుడు అన్నయ్య. కోవిడ్ సమయంలో పనులు లేక సినీ కార్మికులు ఆకలితో అలమటించకుండా ఆయన చూపిన దాతృత్వం... బ్లడ్ బ్యాంక్ స్థాపించి లక్షలాది మందితో ఏర్పరచుకున్న రక్త సంబంధం.... వేలాది గుప్త దానాలు... ఇలా ఒకటి రెండు కాదు. ఇటీవల ప్రకటించిన ఉచిత ఆసుపత్రి స్థాపన వరకూ చేస్తున్న కార్యక్రమాలు ఆయనలోని మానవతామూర్తిని తెలియచేస్తాయి.


అన్నిటికన్నా మిన్న ఆయనలోని ఒదిగి ఉండే లక్షణం. తాను కలవబోయే వ్యక్తి ప్రతి నమస్కారం కూడా చేయలేని కుసంస్కారి అయినప్పటికీ తను చేతులెత్తి నమస్కరించే సంస్కారం శ్రీ చిరంజీవి గారి సొంతం. వయసు తారతమ్యాలు... వర్గ వైరుధ్యాలు... కులమతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకొనే విశాల హృదయుడు  అన్నయ్య చిరంజీవి గారు. అటువంటి సుగుణాలున్న అన్నయ్యకు నేను తమ్ముణ్ణి కావడం నా పూర్వ జన్మ సుకృతం. ఈ శుభ దినం సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని... నాకు తల్లిలాంటి మా వదినమ్మ సహచర్యంలో ఆయన నిండు నూరేళ్ళు చిరాయువుగా వర్థిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్న రూపంలో ఉన్న నాన్నకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను.

(పవన్ కళ్యాణ్)’’ అని పవన్ కల్యాణ్ అధికారికంగా జనసేన తరపున ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.

Pawan Kalyan Birthday wish to Chiranjeevi:

That is the Greatness of Annayya Chiranjeevi says Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs