Advertisement
Google Ads BL

అక్కడ మెగాస్టార్ రా.. బచ్చాస్!


‘ఆయన కళ్లలో ఏదో ఉందయ్యా.. ఆ తేజస్సు చూశారా.. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సినీ ప్రపంచాన్ని ఏలేస్తాడు..’ ఇది ఒకప్పటి మహామహులు చిరంజీవి గురించి చెప్పుకున్నమాట. ఆ మాటను నిజం చేస్తూ.. కొణిదెల శివశంకర వర ప్రసాద్‌గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. చిరంజీవిగా.. ఇవాళ మెగాస్టార్‌గా ప్రకాశిస్తూ.. తిరుగులేని స్థానం, స్థాయిని సొంతం చేసుకున్నారు చిరంజీవి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కిరీటం పెట్టని కింగ్‌గా ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తూ.. 66 ఏళ్ల వయసులో కూడా 26 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అసలా చిరంజీవి అనే పేరులోనే ఏదో శక్తి ఉంది. ఆ శక్తే ఈ రోజు గెలాక్సీగా మారి.. ఎన్నో స్టార్స్‌కి స్థానమైంది. హీరోయిజానికి ఇళ్లయింది. కష్టంలో ఉన్నవారికి కన్నీళ్లు తుడిచి, అండగా నిలిచే ధైర్యమైంది. అభిమానులకు ఆరాధ్యదైవమైంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణానికి కేరాఫ్ అడ్రస్సయ్యింది.

Advertisement
CJ Advs

 

చిరంజీవి నటప్రస్థానం:

1978లో చిరంజీవి సినీ ప్రస్థానికి ‘పునాదిరాళ్లు’ పడ్డాయి. అక్కడి నుండి ఏడాదికి 10కి పైగా చిత్రాల్లో నటిస్తూ.. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ.. హీరోగా అవకాశాలను చిరు అందిపుచ్చుకున్నారు. 1982 నుండి చిరంజీవి‌కి స్టార్‌డమ్ తోడైంది. 1983లో ఇండస్ట్రీకి రంకుమొగుడొచ్చాడని అర్థమైంది. అక్కడి నుంచి చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్ గురించి మాట్లాడుకోవడం ప్రేక్షకుల వంతైంది. అప్పటి నుండి హిట్స్, బ్లాక్‌బస్టర్స్‌తో మొదలైన చిరు సినీ ప్రయాణం.. 1995 వరకు ఎటువంటి బ్రేక్ లేకుండా నడిచింది. 1996లో చిన్న బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేసిన చిరు.. 1997 నుండి వరుసగా 5 సూపర్ హిట్స్ ఇచ్చారు. అక్కడి నుండి ప్రయాణం కాస్త స్లోగా నడిచినా.. 2000లో ‘అన్నయ్య’, 2002లో ‘ఇంద్ర’, 2003లో ‘ఠాగూర్’, 2004లో ‘శంకర్ దాదా MBBS’లతో మెమరబుల్ హిట్స్ అందుకున్నారు. 2007 వరకు సినిమాలతో అలరించిన చిరు ప్రయాణం.. ఒక్కసారి రాజకీయాల వైపు టర్నయింది. మధ్యమధ్యలో స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తూ.. అభిమానులకు వెలితి లేకుండా చేసిన చిరు.. 2017లో పూర్తిగా రాజకీయాలకు స్వస్తి పలికి.. ఇక ఈ జీవితం సినిమాలకే అంకితమవుతున్నట్లుగా ప్రకటించారు. మళ్లీ ‘ఖైదీ నెంబర్ 150’తో రీ ఎంట్రీ ఇచ్చి తనలో వాడి, వేడి ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. 2019లో వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’తో తన చిరకాల వాంఛను తీర్చుకున్నారు. ఆ తర్వాత కరోనా ఇచ్చిన గ్యాప్‌తో ఇండస్ట్రీకి మళ్లీ ఓనమాలు నేర్పే బాధ్యత తీసుకుందామని ‘ఆచార్య’గా వచ్చారు. కాకపోతే, ఏబీసీడీ చదువులు ఎక్కువవడంతో.. ‘ఆచార్య’ పాఠాలు ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు ‘భోళాశంకరుడు’గా, ‘గాడ్‌ఫాదర్’గా, ‘వాల్తేరు వీరయ్య’గా ఊరమాస్ సినిమాలతో ‘బాస్ ఆఫ్ మాసెస్’గా ఇండస్ట్రీ కుంభస్థలాన్ని బద్దలు కొట్టేందుకు చిరు సిద్ధమవుతున్నారు.

 

సేవా రంగం:

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.. ఇది పవన్ కల్యాణ్ మాట అయితే.. ‘ఎంత సంపాదించామన్నది కాదు.. ఎంత తిరిగిచ్చామన్నదానిలో తృప్తి ఉంటుందనేది’ చిరు మాట. అందరికీ తెలిసేలా చేసే సహాయాలు కొన్ని అయితే.. తెలియకుండా చిరు చేసిన గుప్తదానాలు ఎన్నో. ప్రతి రోజూ ఎన్నో లక్షల రూపాయలకి చెక్కులు చిరు ఇస్తుంటారని ఇటీవల రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారంటే.. తెలియకుండా, తెలియనీయకుండా ఉంచిన దానాలు ఎన్నో అర్థం చేసుకోవచ్చు. మొన్న కష్టం వస్తే.. ఇండస్ట్రీ అంతటిని ఒక్క తాటి మీదకి తెచ్చి సిసిసి పేరిట ఎందరికో ఆయన సహాయం అందించారు. ఎలారా దేవుడా? అని ఇంట్లో ఉన్న దేవుడి పటాల వైపు చూసుకుంటున్న కార్మికులకు.. ‘దైవం మానుష రూపేణ’ అన్నట్లుగా.. నేనున్నానంటూ నిత్యావసర సరుకులందించి.. ధైర్యాన్నిచ్చాడు. ఆ తర్వాత కోట్ల రూపాయలతో ఆక్సిజన్ సిలిండర్స్ అందించాడు. ఇవాళ అత్యవసరంగా బ్లడ్ కావాలంటే.. ముందు గుర్తొచ్చేది చిరంజీవే. ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంకే. తన అభిమానులను కూడా సేవా రంగం వైపు నడిపించిన ఘనత చిరంజీవిదే. ఒక్కటేమిటి.. కష్టమని తలుపు తట్టే వారికెప్పుడూ తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చిరు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే సాయం అందిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఒక హాస్పిటల్‌నే కార్మికుల కోసం నిర్మించబోతున్నారు. ఇంకేం చెప్పగలం. సేవకి ఇంతకంటే నిదర్శనం ఇంకా ఏమైనా ఉంటుందా?

 

ఇండస్ట్రీకి పెద్ద దిక్కు:

ఇప్పుడు ఇండస్ట్రీకి లేదంటే ఇండస్ట్రీలోని శాఖలకి, వ్యక్తులకి సమస్య వస్తే.. ముందుగా తొక్కే గడప మెగాస్టార్ చిరంజీవిదే. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని ఆయనంతటకు ఆయన చెప్పుకోకపోయినా ఇది సత్యం. ఆయన నిర్మల మనస్థత్వమే ఇప్పుడాయనని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుని చేసింది. ఇది ఎవరో ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరినీ ఒప్పించాల్సిన అవసరం అంతకన్నా లేదు. జేబులో రూపాయి తీస్తే రూ. 10లు ఎలా సంపాదించాలా? అని ఆలోచించే వారికి.., కష్టమని వస్తే జేబులో ఎంత ఉంటే అంత తీసి ఇచ్చేవారికి తేడా ఉంటుంది కదా. చిరు రెండో కేటగిరీకి చెందిన వారు. ఆయన మాటే శాసనం. అయినా దానిని ఆయన ఒప్పుకోరు. ఎందుకంటే, ఇండస్ట్రీ తనొక్కడిదే అని ఆయన కానీ, ఆయన ఫ్యామిలీ హీరోలు కానీ భావించరు. అందరినీ కలుపుకునే వెళ్లాలని భావిస్తారు. ఇది ప్రతి విషయంలోనూ స్పష్టమవుతూనే ఉంది. కానీ కులాల రొచ్చు అనేది ఒకటి ఉంటుంది కదా.. అది సినీ ఇండస్ట్రీలో ఓ మోతాదు ఎక్కువే ఉంది. దానిని కదిలించి కొందరు అప్పుడప్పుడు పైత్యం ప్రదర్శించడం.. తద్వారా నవ్వులు పాలు కావడం ఈ మధ్యకాలంలో తరుచుగా జరుగుతూనే ఉంది. చిరంజీవిని వేలెట్టి చూపించాలంటే.. అది మళ్లీ ఆయనే అయి ఉండాలి. వేరే వాళ్లకి ఛాన్స్ లేదు.. రాదంతే.

 

అక్కడ మెగాస్టార్ రా.. బచ్చాస్!

చిరు వేయని డ్యాన్స్ ఉందా? చిరు చేయని ఫైట్స్ ఉన్నాయా? ఛేజింగ్ సీన్స్ ఉన్నాయా? గుర్రపు స్వారీలున్నాయా? మ్యానరిజమ్స్ ఉన్నాయా? మాసూ, క్లాసూ ఏదైనా చిరు తర్వాతే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి స్టార్‌డమ్ తెచ్చింది ‘బాహుబలి’ అని ఇప్పుడంతా అనుకుంటున్నారేమో.. కానీ, అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకటుందని, అది బాలీవుడ్‌కైనా పోటీ ఇవ్వగలదని మెగాస్టార్ ఎప్పుడో నిరూపించారు. బిగ్ బి అమితాబ్ సైతం ఔరా అని తలెత్తి చూసేలా చిరు ఎప్పుడో చేశారు. ఇవాళ ఆ హీరో రెమ్యూనరేషన్ అంత పెంచాడు.. ఇంత పెంచాడు అని చెప్పుకుంటున్నారే.. అది చిరు స్థాపించిన సామ్రాజ్యం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కమర్షియల్ హంగులు, హద్దులు అద్దింది ఎవరని.. ఎవరినైనా అడగండి.. మెగాస్టార్ అనే మోగుతుంది. అలాంటిది ఈ మధ్య రాక రాక పుష్కరానికో హిట్ వచ్చిన హీరో ఫ్యామిలీ అభిమానులు.. ఆ హీరో ముందు మెగాస్టార్ ట్యాగ్ పెట్టుకోవాలని నవ్వుల పాలయ్యారు. ఆ హీరోనే సినిమా విడుదలకు ముందు మెగా హీరోల జపం చేశాడని మరిచి.. ట్యాగ్ కొట్టేయాలని చూశారు. కొట్టేయడానికి అదేమైనా కొనుక్కున్నదా! జనాలు మెచ్చి ప్రేమతో ఇచ్చింది. ఇంకో హీరో ఉన్నాడు.. పరిచయమప్పుడు మెగాస్టార్ భజన చేసి.. ఇవాళ కాస్త పేరొచ్చాక ఫౌండేషన్ అంటూ, సైన్యం అంటూ హడావుడి చేస్తున్నాడు. అలాంటి వాళ్లందరికీ మెగాభిమానులు ఇచ్చే సమాధానం ఒక్కటే. అక్కడ మెగాస్టార్ రా.. బచ్చాస్..! మౌనమే ఆయన సమాధానం. అలా అనీ.. కెలికెస్తాం.. తొక్కుకుంటూ పోతాం.. అంటే, కుంభస్థలాలు బద్దలవుతాయ్.. జాగ్రత్త.

 

హ్యాపీ బర్త్‌డే..

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా.. మానవసేవే మాధవసేవగా.. మౌనమే అస్త్రంగా.. ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా.. మెగాభిమానులెందరో అన్నయ్యగా పిలచుకునే ఆరాధ్యదైవానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్’.

Special Article on MegaStar Chiranjeevi Birthday:

Happy Birthday MegaStar Chiranjeevi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs