మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) స్పెషల్‌గా ఒక రోజు ముందే వేడుకలు మొదలయ్యాయి. ఆయన చేస్తున్న చిత్రాల అప్‌డేట్స్ కూడా ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. మోహన్ రాజా దర్శకత్వంలో చిరు చేస్తున్న ‘గాడ్ ఫాదర్’ చిత్ర టీజర్‌ని ఆదివారం సాయంత్రం మేకర్స్ విడుదల చేశారు. తెలుగు, హిందీ వెర్షన్స్‌లో ఈ టీజర్ విడుదల చేశారు. మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం ‘లూసిఫర్’కి ఈ చిత్రం రీమేక్ అనే విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి ఎవరెవరు ఏ యే పాత్రలో చేస్తున్నారనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. ఈ టీజర్‌తో దాదాపు ఆ ఉత్కంఠకు తెరపడింది. చిరంజీవి సోదరిగా నయనతార, నయనతారతో అసభ్యంగా ప్రవర్తించే పోలీసాఫీసర్ పాత్రలో సముద్రఖని.. ఇలా మెయిన్ పాత్రలన్నింటినీ ఈ టీజర్‌లో పరిచయం చేశారు. సత్యదేవ్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా ప్రజంట్ చేశారు.
టీజర్ విషయానికి వస్తే.. భారత జాతీయ జెండాతో మొదలైన ఈ టీజర్ ‘ఇరవై ఏళ్ళు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. సడన్‌గా తిరిగొచ్చిన ఆరేళ్ళలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు’.. అంటూ మురళీ శర్మ వాయిస్‌తో రన్ అయింది. ‘ఇక్కిడికి ఎవరొచ్చినా రాకపోయినా నేను పట్టించుకోను. కానీ అతను మాత్రం రాకూడదు’ అని నయనతార చెప్పిన డైలాగ్‌తో ‘లూసిఫర్’ వేలోనే ఈ చిత్రం నడిచినట్లుగా అర్థమైంది. ‘డూ యు నో హూ హి ఇస్? హిఈజ్ ది బాస్ అఫ్ ది బాసెస్. అవర్ వన్ అండ్ ఓన్లీ గాడ్ ఫాదర్’ అంటూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌లో వినిపించిన డైలాగ్ అనంతరం మెగాస్టార్ టెర్రిఫిక్ ఎంట్రీ ఇస్తే.. ‘లగ్ రహా హై బడి లంబీ ప్లానింగ్ చల్ రహీ హై. అప్నే ఇస్ ఛోటే భాయ్ కో భూల్ నా నహీ.. కహే తో ఆజాతా హూ మై..’ అంటూ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. ‘వెయిట్ ఫర్ మై కమాండ్’ అంటూ సల్మాన్‌కి చిరు చెప్పిన డైలాగ్, ఆ తర్వాత వచ్చే ఎలివేషన్స్ టీజర్‌ని ఓ లెవల్‌కి తీసుకెళ్లడమే కాకుండా.. సినిమాపై క్యూరియాసిటీకి కారణమవుతున్నాయి. టీజర్‌లో థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అనే రేంజ్‌లో ఉంది కానీ.. వినిపించిన పాటే.. ‘గని’ని తలపించింది. కెమెరా, నిర్మాణ విలువలు అన్నీ హైలెట్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా మెగా బర్త్‌డే ట్రీట్ అదిరిపోయిందనే చెప్పాలి. కొణిదెల సురేఖ సమర్పణలో.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా 05 అక్టోబర్ 2022న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ఈ టీజర్‌లో అధికారికంగా ప్రకటించారు.