రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరో నాలుగు రోజుల్లో ‘లైగర్’గా వేటకు సిద్ధమవుతున్నాడు. ఈలోపు సినిమాకు సాధ్యమైనంతగా ప్రమోషన్ చేసేందుకు ప్రమోషన్ టూర్‌లో బిజీబిజీగా ఉన్నాడు. అయితే మరోవైపు ఈ సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ కొందరూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అందుకు కారణం ఈ సినిమాకి బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన కరణ్ జోహర్ కూడా నిర్మాతగా వ్యవహరించడమే. దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ మృతికి కరణ్ కూడా ఓ కారణంగా బాలీవుడ్ ప్రేక్షకులు కొందరు భావిస్తున్నారు. అందుకే ఈ మధ్య బాలీవుడ్‌లో ఏ సినిమా విడుదలైనా.. విడుదలకు ముందు బాయ్‌కాట్ ట్యాగ్‌కి.. విడుదల తర్వాత ప్లాప్ టాక్‌కి లోనవుతున్నాయి. ఇప్పుడీ సెగ.. ‘లైగర్’ని కూడా తాకింది. అయితే ఈ ట్యాగ్‌పై రౌడీ తనదైన తరహాలో రెస్పాండ్ అయ్యాడు.
‘‘ ‘లైగర్’కి నార్త్ బెల్ట్‌లో ఎక్కువ రీచ్ రావడానికే కరణ్ సర్‌తో కలిశాము. ‘బాహుబలి’ని ఆయన ఇండియాకి పరిచయం చేశారు. ఈ సినిమా కథతో ఆయన దగ్గరకు వెళితే.. ఆయన ఎంతో ఓన్ చేసుకుని.. ఈ సినిమాకి భాగమయ్యారు. ఆయన ఉన్నారు కాబట్టే నార్త్‌లో కూడా సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రమోషన్స్ కూడా బాగా జరుగుతున్నాయి. అసలు వీళ్ళకి (బాయ్‌కాట్ ట్యాగ్‌తో న్యూసెన్స్ చేస్తున్నవారికి) ఏం కావాల్నో నాకయితే అర్థం కావడం లేదు. ఆ గొడవేంటో కూడా నాకు సరిగ్గా తెలవదు. మేము సినిమాలు చేసుకోకుండా ఇంట్లో కూర్చోవాలా. మేము పుట్టింది ఇండియాలోనే. మేము పని చేయవద్దా. మూడేళ్లు కష్టపడి సినిమా చేసినం. మేము ఏ సిటీకి వెళ్లినా జనాలు ఎంతగానో ప్రేమిస్తున్నారు. వారి కోసం మేము సినిమాలు చేస్తున్నాం. మనోళ్లు మనకి ఉన్నప్పుడు ఎవడికీ భయపడేది లేదు. అందుకే మెసేజ్ కూడా పెట్టా.. మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు, మన ధర్మం మనం చేసినప్పుడు.. ఎవడిమాటా వినేదే లేదు. ఏదొచ్చినా కొట్లాడుదాం. ముందుకు వెళుతుంటే వెనక్కి లాగేటోడు మనకెందుకు. కష్టంలో ఉన్నప్పుడు మేమున్నామని సహకారం అందించి, సపోర్ట్ చేసే వాళ్లు మనకి కావాలి. ఒక అమ్మ, కొడుకు ఇండియాలో ఛాంపియన్ కావాలని, జెండా ఎత్తాలని చేసే ప్రయాణమే ఈ కథ. ఇలాంటి సినిమాని బాయ్‌కాట్ చేస్తారా? ఇప్పుడు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. టికెట్స్ కూడా ఆల్‌మోస్ట్ అయిపోతున్నాయి. నాకయితే ఎటువంటి భయం లేదు. నిజాయితీగా ముందుకు వెళుతున్నాం” అని విజయ్ దేవరకొండ విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.