చిత్రపురి కాలనీలో కొణిదెల వెంకట్రావు పేరు మీద హాస్పిటల్ కట్టించబోతున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సిసిసి జర్సీ అండ్ ట్రోఫీ లాంఛ్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి.. ఈ హాస్పిటల్ గురించి ప్రస్తావించారు. ఈ హాస్పిటల్ నిర్మాణానికి నాందిగా శ్రీకాంత్ అండ్ క్రికెట్ టీమ్ రూ. 20 లక్షల చెక్ చిరుకి అందించారు. ఇంకా ఇదే కార్యక్రమంలో చిరంజీవికి ముందస్తు పుట్టినరోజు వేడుకలను సిసిసి ఆర్గనైజర్స్ నిర్వహించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ..
‘‘నాకు చిత్రపురి కాలనీ హాస్పటల్ కట్టించాలనే ఆలోచన వచ్చినప్పటి నుండి దాని గురించే ఆలోచిస్తున్నాను. 10 పడకల ఆసుపత్రి నిర్మించాలనేది నా ఆలోచన. పెద్ద హాస్పటల్‌కి వెళ్లేంత ప్రాబ్లమ్ లేని వాటి కోసం ఇక్కడ హాస్పిటల్ ఉంటే బాగుంటుదని అనిపించింది. చిత్రపురి కాలనీలో ఉండే సినీ వర్కర్స్, డైలీ వేజ్ వర్కర్స్ అందరికీ ఇది ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. కార్పోరేట్ హాస్పిటల్‌లో ఉన్న పెద్దలందరూ నాకు స్నేహితులే. వాళ్లందరి సహకారంతోటి ఖచ్చితంగా ఇది నేను చేయగలను. చేస్తే కనుక ఉండే తృప్తి అంతా ఇంతా కాదు. మొట్టమొదటగా చెప్పాలంటే ఆ హాస్పిటల్ కోసం చేయూతను అందించిన నా తమ్ముళ్లందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ హాస్పిటల్ మా నాన్నగారి పేరు మీద పెట్టాలని.. కొణిదెల వెంకట్రావుగారి హాస్పిటల్ అని అనుకుంటున్నాను. ఈ పుట్టినరోజుకి మాట ఇస్తున్నాను.. రాబోయే పుట్టినరోజుకి హాస్పిటల్‌లో సేవా కార్యక్రమాలు జరిగేలా ప్లాన్ చేస్తున్నాను. దానికి ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే.. లేదూ ఎవరైనా భాగస్వాములు అవుతానంటే సంతోషంగా వారికి కూడా ఆ ఆనందం, అనుభూతిని ఇస్తాను.. లేదంటే మొత్తం నేను పెట్టుకునే శక్తి.. ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు.. నేను చేస్తాను. మన ఎదుగుదలకి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైనటువంటి మా కార్మికులందరికీ ఇది ఉపయోగపడేదిగా ఉంటుందని భావిస్తూ.. ఇది నా ప్రాథమిక బాధ్యతగా తీసుకుంటున్నాను. నేను హాస్పిటల్ కడుతున్నానని తెలియగానే.. ఎందరో డాక్టర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ వారు మా సహకారం అందిస్తామని, మంచి భావనతో ముందుకు వస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు..’’ అని చెప్పుకొచ్చారు.