సెన్సేషనల్ దర్శకుడు కొరటాల శివ విషయంలో కొన్ని రోజులుగా ఎటువంటి రూమర్లు వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. ఆయన చివరిగా దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూడటంతో.. ఆ సినిమాని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లందరూ.. ఆ సినిమాతో బాగా నష్టపోయామని.. ఎంతో కొంత అమౌంట్ సెటిల్ చేయాలని కొరటాలతో ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ డిస్ట్రిబ్యూటర్ల సమస్య తీర్చేందుకు కొరటాల శివ.. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని తనకున్న ప్రాపర్టీని అమ్మేందుకు సిద్ధమైనట్లుగా.. సోషల్ మాధ్యమాలలో ఒకటే వార్తలు. మరి ఇందులో నిజమెంత ఉందనేది కూడా.. తెలుసుకోకుండా యూట్యూబ్ ఛానళ్ల అత్యుత్సాహంతో.. లేనిపోని రాతలు ఈ విషయంపై వైరల్ కావడం మొదలెట్టాయి.
అసలు విషయం తెలుసుకోకుండా ఏవి పడితే అవి రాస్తూ.. కొరటాల ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే స్థాయికి సోషల్ మీడియాలోని కొందరు నెటిజన్లు కంకణం కట్టుకున్నారు. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘ఆచార్య’ డిస్ట్రిబ్యూటర్లు కొందరు దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డిని కలిసిన విషయమైతే నిజమేనని తెలుస్తుంది. తమ వద్దకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్లకు అమౌంట్ రిటన్ చేస్తామని కొరటాల, నిరంజన్ రెడ్డి మాటిచ్చారని, ప్రస్తుతం ఆ సమస్య సద్దుమణిగినట్లేనని తాజాగా తెలియవచ్చింది. దీని కోసం, కొరటాల ఏదో ప్రాపర్టీని సేల్‌కి పెట్టినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, అది కావాలని పుట్టించిన రూమర్లుగానే కొరటాల వర్గం కొట్టిపారేశారు. సో.. ఇకనైనా వార్తలని చెప్పుకుంటున్న రూమర్లకు గాసిప్ రాయుళ్లు బ్రేక్‌లు వేస్తే బాగుంటుంది.