‘‘ఎవడు పడితే వాడు రావడానికి.. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి.. ఇదేమైనా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా..’’ అంటూ ‘భాగమతి’ చిత్రంలో అనుష్క చెప్పిన డైలాగ్ మాదిరిగా.. ఇప్పుడు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ.. సూపర్ స్టార్ రజినీకాంత్ అడ్డాగా మారిపోయింది. రజినీకాంత్ సినిమా అంటే చాలు, ఖచ్చితంగా రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరగాల్సిందే అనేలా.. లెక్కలు మారిపోయాయి. ఇంతకు ముందు ఆయన చేసిన ‘అణ్ణాత్త’ చిత్ర షూటింగ్ మేజర్ పార్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రజినీ హీరోగా ‘బీస్ట్’ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించబోతున్న ‘జైలర్’ చిత్ర మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం దాదాపు రామోజీ ఫిల్మ్ సిటీలోనే చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తుంది. అందుకోసం భారీ సెట్స్‌ని ఆర్ఎఫ్‌సిలో మేకర్స్ ఏర్పాటు చేస్తున్నట్లుగా తాజా సమాచారం.
రజినీకాంత్ వయసు, ఆరోగ్యం దృష్ట్యా.. ఒకే చోట ఈ చిత్ర షూటింగ్‌ని జరపాలని మేకర్స్ నిర్ణయానికి రావడంతో.. సినిమాకు సంబంధించిన అన్ని సెట్స్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో వేసినట్లుగానూ, దాదాపు అక్కడ 60 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్‌ను నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేసినట్లుగానూ చిత్రవర్గాల నుండి తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. రజినీకాంత్ కాంత్ సరసన మరోసారి ఐశ్వర్యరాయ్ నటిస్తోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్ మోహన్ కీలక పాత్రలలో నటించనున్నారు. స్టార్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ ఈ చిత్రానికి స్ర్కీన్‌ప్లే సమకూర్చుతుండగా.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.