లావణ్య త్రిపాఠి.. ముద్దుగా అందరూ లవ్స్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఈ భామకి అదృష్టం ఏ కోశానా కలిసి రావడం లేదు. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులతో ‘అందాల రాక్షసి’ అని పిలిపించుకున్న లావణ్యకు.. ఆ తర్వాత వరుస అవకాశాలు పలకరించడం, మధ్యలో రెండు మూడు మంచి హిట్ సినిమాలు పడటంతో.. ఈ భామకి టాప్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగానే ఉన్నాయని అంతా అనుకున్నారు. కానీ, ఒక్కసారిగా ఆమె ఫేట్ మారిపోయింది.. ఈ మధ్య కాలంలో ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నాయి. తద్వారా అవకాశాలు కూడా తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో లేడీ ఓరియంటెడ్ తరహాలో ఓ సినిమా ఛాన్స్ ఆమెను వరించడం, దానితో మళ్లీ తన స్టామినాని నిలబెట్టుకుంటానని ఆశాభావం వ్యక్తం చేయడం వంటివి వరుసగా జరిగిపోయాయి.
అయితే, ఆ సినిమా కూడా పాపం లావణ్యకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ‘హ్యాపీ బర్త్‌డే’ అంటూ తాజాగా విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయలేకపోయింది. తద్వారా మళ్లీ లావణ్యకు అపజయమే ఎదురైంది. వాస్తవానికి ‘హ్యాపీ బర్త్‌డే’ చిత్రంపై లావణ్య త్రిపాఠి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా.. వెరైటీ సినిమాగా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందని భావించింది. అందులోనూ తను లీడ్ రోల్ చేయడంతో.. ఈ సినిమా విజయం సాధిస్తే.. మున్ముందు ఇలాంటి పాత్రలు తనని పలకరిస్తాయని లావణ్య ఆశపడితే.. ఆ ఆశలన్నింటిపై ‘హ్యాపీ బర్త్‌డే’ రిజల్ట్ నీళ్లు చల్లేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
ఇప్పుడు హిట్టు సంగతి పక్కన పెడితే.. అర్జెంట్‌గా ఆమె ఆశలని నిలిపే ఛాన్స్ ఒకటి లావణ్యకి కావాలి.. లేదంటే, టాలీవుడ్‌లో ఆమె దుకాణం సర్దేసినట్లే అనేలా ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. మరోవైపు, డైరెక్టర్ మారుతి ‘భలే భలే మగాడివోయ్’ పార్ట్ 2 అంటున్నాడు కాబట్టి.. ఆ సినిమాలో ఏమైనా లావణ్యకు ఛాన్స్ ఇస్తారో.. లేదంటే, ‘బంగార్రాజు’ తరహాలో పక్కన పెట్టేస్తారో చూడాలి.