ఇటీవల కాలంలో అంటే.. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత సోషల్ మీడియాలో చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా గ్లామర్ ప్రదర్శనతో ఆమె అందరికీ షాకిస్తోంది. అలాగే వర్కవుట్స్ చేస్తున్న వీడియోలను కూడా షేర్ చేసి.. కుర్రకారులో హీట్ పెంచుతోంది. అయితే ఆ వీడియోలు, ఆ గ్లామర్ ప్రదర్శనను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి కారణం ఏంటో.. సమంత తన తాజా ఇంటర్వ్యూలో ప్రకటించింది. వాటిని చూసి కొంతమందైనా స్ఫూర్తి పొందుతారనే ఆశతోనే ఆ పని చేస్తున్నట్లుగా సమంత చెప్పుకొచ్చింది.
‘‘నా వర్కవుట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నందుకు అంతా ఇంకోలా ఆలోచిస్తూ ఉంటారు. నేను వాటిని పోస్ట్ చేయడానికి కారణం అవి చూసి కొంత మంది అయినా స్ఫూర్తి పొందుతారనే ఆశతోనే నేను ఆ పని చేస్తున్నాను. నా దగ్గరకు వచ్చే అమ్మాయిలందరినీ నేను అడిగే మొదటి ప్రశ్న.. వర్కవుట్స్ చేస్తుంటారా? డైట్ పాటిస్తారా? అనే. ఎందుకంటే.. కేవలం గ్లామర్ కోసం మాత్రమే కాదు.. ఇవి ఆరోగ్యం కోసం కూడా. ఏ పని చేసే వారికైనా.. ఆరోగ్యం కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించడం ఈ రోజుల్లో చాలా అవసరం..’’ అని సమంత తెలిపింది.
ఇంకా సమంత మాట్లాడుతూ.. ‘‘నా వరకు నేను రోజూ సుమారు 2గంటల పాటు జిమ్‌లో గడుపుతాను. జిమ్‌కి వెళ్లకపోతే ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది. ఉదయాన్నే నిద్రమానేసి.. జిమ్‌కి వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఆ దశని దాటుకుని.. ఇబ్బంది అయినప్పటికీ జిమ్‌కి వెళ్లడం అలవాటు చేసుకోండి. వర్కవుట్స్ చేయడం స్టార్ట్ చేశాక.. జీవన విధానంలో కూడా చాలా మార్పు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ మధ్య జిమ్‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలే.. ఎక్కువ కనిపిస్తుండటం చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది..’’ అని వెల్లడించింది.