కరోనా లాక్ డౌన్ టైం లో ఓ ఏడాది పాటు షూటింగ్స్ లేక సినిమా కార్మికులు అల్లాడిపోగా.. బడా, చిన్న నిర్మాతలు చాలా నష్టపోయారు. లాక్ డౌన్ తో షూటింగ్స్ అన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అయితే మళ్లీ పరిస్థితులు చక్కబడి సినిమా షూటింగ్స్ అన్నీ యధావిధిగా మొదలైపోయాయి. కానీ ఇప్పుడు మరొక్కసారి టాలీవుడ్ లో షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. తమకి వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన చేపట్టేందుకు రెడీ అయ్యారు.
రేపటినుండి అంటే బుధవారం నాడు 24 విభాగాల కార్మికులు ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునివ్వడమే కాకుండా.. రేపటినుంచి సినిమా షూటింగ్‌లకు సైతం దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో షూటింగ్స్ అన్ని ఆగిపోనున్నాయి. వేతనాల పెంపుపై నిర్మాతల మండలి స్పందించడం లేదు. 24 విభాగాల్లోని ఒక్కో కార్మిక సంఘం నాయకులతో చర్చిస్తున్నాం. ప్రతీ మూడేళ్లకోసారి సినీ కార్మికుల వేతనాలు పెరగాలి. కానీ నాలుగేళ్లైనా సినీ కార్మికుల వేతనాలు పెంచలేదు. కార్మిక సంఘాలు ఫిల్మ్ ఫెడరేషన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి.. అంటూ ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ చెబుతున్నారు.