పెదరాయుడు సినిమాలో ఎమ్మెస్ నారాయణ చెప్పినట్టు.. ఎప్పుడూ చూడలేను అనుకున్నది ఈరోజు చూశాను..
మా ఊరిలో మహేష్ బాబు సినిమా మార్నింగ్ షో ఏ ఒక్క థియేటర్లోనూ ఫుల్ కాలేదు. ఒకప్పుడు మార్నింగ్ షో టికెట్ కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు టికెట్ కౌంటర్ లో వాళ్లే పిలిచి మరీ ఇస్తున్నారు. అంటే మహేష్ బాబు క్రేజ్ తగ్గిందా.. లేదంటే పెరిగిన టికెట్ రేట్లతో సామాన్యుడు సినిమాలకు దూరం అవుతున్నాడా..? Just Asking..
ఏదో మహేష్ బాబు వరకు మాత్రమే కాదు. మొన్నటి ఆచార్య సినిమాది ఇదే పరిస్థితి. బాబ్బాబు ఒక్క టికెట్ ఇవ్వండి అనే పరిస్థితి నుంచి.. చిరంజీవి, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాకు కూడా మొదటి రోజే.. నీ ఇష్టం వచ్చినన్ని టికెట్లు తీసుకోండి అనే స్థాయికి వచ్చింది పరిస్థితి.
నాకు ఊహ తెలిసాక మా ఊళ్లో నేను చూసిన హైయెస్ట్ టికెట్ రేట్ 110 రూపాయలు. కానీ ఇప్పుడు 240 రూపాయలు.. ఇంత దారుణంగా టికెట్ రేట్లు పెరుగుతుంటే.. భారీ కలెక్షన్స్ రావడం మాట దేవుడెరుగు.. కనీసం మొదటి రోజు థియేటర్లకు జనం రావడానికి భయపడుతున్నారు. పెరిగిన టికెట్ రేట్లు సినిమాకు హెల్ప్ అవుతున్నాయా లేదంటే కిల్ చేస్తున్నాయా అనేది అర్థం కావడం లేదు. ఒక సినిమా లవర్ గా.. పెద్ద హీరోల సినిమాలకు మొదటిరోజు టికెట్లు దొరక్కూడదు.. జనంతో థియేటర్స్ ఊగిపోవాలి.. రిఫరెన్సులతో మూడు రోజులపాటు టికెట్లు తెప్పించుకోవాలి.. అలా చూస్తేనే సినిమాకు మజా.. ఆ రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ తప్పు ఎవరిదో అర్థం కావడం లేదు.
పెరిగిన వడ్డీ రేట్లు కట్టాలని సినిమా టికెట్ రేట్లు కూడా పెంచుతున్నారు. కానీ పెరిగిన టికెట్ రేట్లు చూసి.. వీరాభిమానులు కూడా థియేటర్లకు రావడం మానేస్తున్నారు. దీనిమూలంగా ఎవరు నష్టపోతున్నారు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. టికెట్ రేట్లు ఇంతకుముందులా ఉంటే.. కనీసం మొదటి మూడు రోజులు టాక్ తో సంబంధం లేకుండా హౌస్ ఫుల్స్ అయ్యేవి. కానీ ఇప్పుడు టికెట్ రేట్లు పెరిగిన తర్వాత కనీసం మార్నింగ్ షో కూడా ఫుల్ కావడం లేదు. మరి దీనికి పరిష్కారం ఎక్కడుందో దర్శక నిర్మాతలకే తెలియాలి.
ఇది ఎవరినీ తప్పు పట్టడానికి కాదు.. మహేష్, చిరంజీవి లాంటి హీరోల సినిమాల థియేటర్స్ కూడా ఫస్ట్ డే మార్నింగ్ షో ఖాళీగా కనిపిస్తుంటే సినిమా ప్రేమికుడిగా ఒక తెలియని ఆవేదన..