గత నెల రోజులుగా పాన్ ఇండియా మూవీస్ హిందీ మార్కెట్ మీద దాడికి దిగాయి. హిందీ హీరోలు కూడా కొల్లగొట్టలేని కలెక్షన్స్ తో బాలీవుడ్ బాక్సాఫీసుని దడదడలాడిస్తున్నాయి. ట్రిపుల్ ఆర్ మొదటి రోజు హిందీలో రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టగా.. నిన్నగాక మొన్నొచ్చిన కేజిఎఫ్ 2 మొదటి రోజే హిందీ సినిమాల కలెక్షన్స్ దాటేసి అక్కడి హీరోలకి చుక్కలు చూపించింది. కెజిఎఫ్2 మొదటి రోజు 53.50 కోట్లు వసూళ్లుతో భారీ ఓపెనింగ్స్ మూటగట్టుకుంది. తర్వాత రోజు కూడా కెజిఎఫ్ వసూళ్ళలో స్వల్ప తగ్గుదల కనిపించింది. రెండో రోజు అక్కడ 46.79 కోట్లు కొల్లగొట్టింది. రెండో రోజుకే కెజిఎఫ్ 2 హిందీలో 100 కోట్ల మార్క్ దాటేసింది.
కానీ ట్రిపుల్ ఆర్ కి మాత్రం మూడు రోజులు దాటాక కానీ అంటే ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి 100 కోట్ల మార్క్ అందుకుంది. ట్రిపుల్ ఆర్ విడుదలైన మూడు వారాంతాల్లో 250 కోట్ల మార్క్ ని సెట్ చేస్తే.. కెజిఎఫ్ 2 మొదటి వారం పూర్తయ్యేలోపే 200 కోట్ల టార్గెట్ ని రీచ్ అయ్యేలా కనబడుతుంది. కెజిఎఫ్ 2 మూడో రోజు కూడా హిందీలో 42.90 కోట్లు కొల్లగొట్టింది. హిందీలో కెజిఎఫ్ 2 కలెక్షన్స్ చూసి అక్కడి ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయంటే.. కెజిఎఫ్2 దూకుడు బాలీవుడ్ లో ఎలా ఉందో అర్ధమవుతుంది.