నగరి ఎమ్యెల్యే, జబర్దస్త్ జేడ్జ్ రోజా భర్త సెల్వమణి చిక్కుల్లో పడ్డారు. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ.. రోజా తో కలిసి నగరి అభివృద్ధి కార్యక్రమాల్లో యాక్టీవ్ గా పాల్గొంటున్న సెల్వమణి పై చెన్నైలోని జార్జి టౌన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎందుకంటే 2016లో సెల్వమణి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోద్రాపై సంచలన వ్యాఖ్యలు చెయ్యడంతో.. ఆయన తన పరువుకు సెల్వమణి ఇంకా కాంగ్రెస్ ఎమ్యెల్యే అరుళ్ అన్పరసు లు భంగం కలిగించారంటూ చెన్నై జార్జి టౌన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అప్పటినుండి ఆ కేసు నడుస్తుంది.
అయితే ముకుంద్ చంద్ బోద్రా కొన్నాళ్ల క్రితమే మృతి చెందగా ఆయన కొడుకు ఈ కేసుని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ కేసులో భాగముగా ఈ నెల ఐదు న కేసు విచారణకు రాగా అటు సెల్వమణి కానీ, ఇటు అరుళ్ అన్పరసు కానీ కోర్టుకి హాజరవకుండా.. కనీసం తమ తరపు లాయర్లు పంపకుండా నిర్లక్ష్యం చేసినందుకు గాను ఆగ్రహించిన చెన్నై జార్జి టౌన్ కోర్టు సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.