ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితి చూస్తోంటే బాక్సాఫీస్ తో చెడుగుడు ఆడడానికి బాబాయ్ - అబ్బాయ్ లు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. పలు విషమ పరిణామాలు చవిచూసి.. అవరోధాలు అధిగమించి అలుపు తీర్చుకుంటోన్న చిత్ర పరిశ్రమకు ఇది మంచి మలుపే.!
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోన్న దశలో తెలుగు సినిమాకి మళ్ళీ ఊపిరి పోయాలని, ఊపు తేవాలని పట్టుదలతో ఆంధ్రాలో టికెట్ రేట్ల సమస్యని సైతం లెక్క చేయక నందమూరి నైజంతో అఖండ గా వచ్చేసారు బాలయ్య. దాంతో థియేటర్లు దద్దరిల్లాయి. కలెక్షన్లు వెల్లువెత్తాయి. పాండమిక్ సిట్యుయేషన్ తరువాత బాలయ్య అనుకున్నట్టే అఖండ విజయంతో పరిశ్రమకి గొప్ప ఆరంభం దొరికింది. పుష్ప అలంకరణ జరిగింది.
కానీ సంక్రాంతికి మళ్ళీ కథ మొదటికొచ్చింది. కళ తగ్గిపోయింది. సందడి లేకుండానే పండగ వచ్చి వెళ్ళిపోయింది. అవాంతరాల హద్దులు చెరుపుకుని పెద్ద సినిమాలు వచ్చేదెపుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తోన్న దశలో ఈసారి ఆ సాహసానికి పవన్ కళ్యాణ్ పూనుకున్నారు. దాంతో మళ్ళీ పూనకం వచ్చింది బాక్సాఫీస్ కి. సమస్యలతో సంబంధం లేకుండా థియేటర్ల వద్ద జాతర జరిగింది. ఆంధ్రాలో తప్ప అన్నిచోట్లా మొదటివారం రికార్డుల మోత మోగింది. మొత్తానికైతే సమ్మర్ శంఖాన్ని సంచలన రీతిలో పూరించాడు భీమ్లా నాయక్.
ఇలా ఇటు నటసింహం - అటు అడవి పులి ఇద్దరూ సంచలనం సృష్టించగా.. ఆ సంచలనాన్ని ఆకాశం అంచులవరకూ తీసుకువెళ్లేందుకు ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తో వస్తున్నారు అబ్బాయ్ లు. చిన్న డిఫరెన్స్ ఏమిటంటే బాబాయ్ లు విడి విడిగా చేసిన విధ్వంసాన్ని అబ్బాయ్ లు ఇద్దరూ కలిసి ఒకే సినిమాతో విస్ఫోటనంలా మార్చబోతుండడం.!
తారక్ - చరణ్ ల తిరుగులేని కాంబినేషన్ తో ఎదురులేని డైరెక్టర్ రాజమౌళి మలిచిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం మెగా - నందమూరి అభిమానులకు ఎంత ప్రత్యేకమో... యావత్ ఇండస్ట్రీకి అంతే ప్రతిష్టాత్మకం. ఇపుడీ సినిమా మేనియా వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ లో ఉందో.. మున్ముందు మనం ఎటువంటి వండర్స్ చూడనున్నామో అందరికీ తెలిసిందీ, ఆశించేదీ.. ఊహించేదే కనుక అవి మరో ఆర్టికల్ లో చూసుకుందాం.
ఇక్కడ మాత్రం ఇదీ బాబాయ్ - అబ్బాయ్ ల దెబ్బంటే అని శెభాష్ అనేద్దాం.!