ఆత్రుత అంతకంతకూ పెరిగిపోతోంది.
ఆరాటం అంతకుమించి పరుగులు పెడుతోంది.
అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ జోరు జోరుగా సాగుతున్నాయి.
సరిగ్గా వారం రోజుల్లో RRR రిలీజ్ పెట్టుకుని నేడు హఠాత్తుగా ఓ ఆటంబాంబ్ పేల్చారు రాజమౌళి. తారక్ - చరణ్ ఫ్యాన్సుకే కాక RRR రాకకై వేయికళ్లతో వేచి చూస్తోన్న మూవీ లవర్స్ అందరికీ ఒక్కసారిగా హార్ట్ బీట్ అండ్ పల్స్ రేట్ పెంచేసిన ఆ బ్లాస్టింగ్ మేటర్ ఏమిటంటే...
RRR ట్విట్టర్ హేండిల్ నుంచి సమ్ థింగ్ డిఫరెంట్ థాట్ తో ఓ వీడియో విడుదలైంది. అది సీక్రెట్ గా షూట్ చేసిన ఆఫ్ ది రికార్డ్ ఫుటేజ్ అని ప్రకటించారు కానీ కాలర్ మైక్స్ పెట్టుకుని ఎంటర్ అయిన తారక్ - చరణ్ లు మొదట్లోనే అది జక్కన్న ప్రమోషనల్ లెక్కల్లో భాగమని స్పష్టం చేసేసారు. సరే.. ఏదైతేనేం ఎవరెవరో అడిగే క్వశ్చన్స్ కి ఈ త్రయం సమాధానమివ్వడం ఇప్పటికే పలుమార్లు చూసేసి ఉన్న అభిమానులకి మూడేళ్లు RRR కోసం కలిసి ప్రయాణించిన ఆ ముగ్గురూ వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవడం ముచ్చటగా అనిపించింది.
అలిసిపోయి ఉన్న తారక్ కోసం చరణ్ కాఫీ కలుపుతా అనడం.. నీ చేత్తో విషం ఇచ్చినా తాగేస్తా అని తారక్ చెప్పడంలో వ్యక్తమైన వారిద్దరి స్నేహ బంధం సోషల్ మీడియాలో నిత్యం కొట్టుకుంటున్న మూర్ఖపు అభిమానులకి కనువిప్పు కలిగించేలా ఉంది. అలాగే ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం పలు ప్రాంతాల పర్యటనలపై చర్చించుకోవడం.. రాజమౌళి రాజేసిన టాపిక్ వల్ల షర్ట్ ల గురించి తారక్ - చరణ్ నాదంటే నాదని అల్లరి చేయడం వంటివన్నీ సరదాగా సాగాయి కానీ ఆపైనే అసలు మలుపు తిరిగింది ఆ వ్యవహారం.
RRR షూటింగ్ లో రాజమౌళి తమని ఎంత ఇబ్బంది పెట్టారో.. ఎన్ని షాకులిచ్చారో చెప్పే ప్రాసెస్ లో తారక్ తనపై తీసిన వాటర్ ఎపిసోడ్ లోని కొన్ని షాట్స్ గురించి ఓపెన్ అయితే.. చరణ్ తనకెదురైన ఫైర్ ఇన్సిడెంట్ చెప్పాడు. సినిమాలో ఫైర్ అండ్ వాటర్ తరహాలో కనిపించే ఆ ఇద్దరూ తమ గురించి చెప్పుకుంటే తిక్క రేగిన జక్కన్న ఎందుకు ఊరుకుంటాడు చెప్పండి. అందుకే పేల్చాడు ఆటంబాంబ్.!
రాజమౌళి - కీరవాణి వాళ్ళ దృష్టిలో సినిమాని జీడి పప్పు ఉప్మాలా కంపేర్ చేసుకుంటారట. కథ ఉప్మా అయితే - హీరో ఇంట్రో, ఎలివేషన్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ట్విస్టులు, టర్నులు వంటివి జీడి పప్పులట. RRR రీ రికార్డింగ్ టైమ్ లో పెద్దన్నా జీడిపప్పులు సరిపోయాయా అని అడిగితే పర్ ఫెక్ట్ గా కుదిరాయి అని చెప్పిన కీరవాణి ఒక్క ఎపిసోడ్ గురించి అడిగినపుడు మాత్రం దాని గురించి మాట్లాడకు.. ఆ ఎపిసోడ్ జీడిపప్పు కాదు ఆటంబాంబ్ అన్నారట. అదే తానూ నమ్ముతున్నానని అంటూ RRR సెకండ్ హాఫ్ లో బ్లాస్ట్ అయ్యే ఆ బాంబింగ్ ఎపిసోడ్ గురించి హింట్ ఇచ్చిన దర్శక బాహుబలి సినిమాపై ఇప్పటికే ఉన్న ఉత్సుకతను ఉన్నట్టుండి పదింతలు పైపైకి పట్టుకుపోయారు.
ఓవైపు హీరోలిద్దరూ పావుగంటపాటు ఎక్స్ ట్రీమ్ లెవెల్ లో ఎక్సట్రార్డినరీగా జరిగే ఇంటర్వెల్ ఎపిసోడ్ గురించి చెబుతూ హైప్ ఎక్కిస్తుంటే - సెకండాఫ్ లో ఉంటుంది అసలు ఆటంబాంబ్ అంటూ డైరెక్టర్ పిచ్చెక్కిస్తుంటే జనం ఎలాగండీ ఆగేది.. జ్వరాన్ని ఎవరండీ ఆపేది. ఇది RRR ఫీవర్. టైగర్ నీ హంటర్ నీ తనివితీరా తెరపై చూసేవరకూ తగ్గేదే లే..!