బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ఛత్రపతి హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. టాలీవుడ్ సినిమాలని పక్కనబెట్టి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ ఛత్రపతి రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్, ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు కావడం కలకలం సృష్టినుంచింది. తనకి సినిమా చేస్తాను అని మాటిచ్చి అడ్వాన్స్ కూడా తీసుకుని, ప్రాజెక్టు క్యాన్సిల్ అయినా.. తన అడ్వాన్స్ తిరిగి ఇవ్వకుండా, డబ్బుల అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఓ నిర్మాత బెల్లంకొండ తండ్రి కొడుకులపై చీటింగ్ కేసు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకుడిగా.. శరన్ కుమార్ అనే నిర్మాత(హౌరా బ్రిడ్జ్ నిర్మాత) ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. శరన్ కుమార్ ఈ ప్రాజెక్ట్ కోసం గోపీచంద్ కి, బెల్లంకొండ శ్రీనివాస్ కి అడ్వాన్స్ లు కూడా ఇచ్చేశారట. అయితే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంతో ఆయన అడ్వాన్స్ లు ఇచ్చిన అందరూ ఆయనకి తిరిగి ఇవ్వగా.. బెల్లంకొండ తండ్రి కొడుకులు మాత్రం తనకి ఇవ్వాల్సిన 84 లక్షల అడ్వాన్స్ తిరిగి ఇవ్వకుండా, తిరిగి ఇవ్వమని అడిగితే తనని బెదిరించారు అంటూ బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్ లపై శరన్ కుమార్ కేసు పెట్టారు. నిర్మాత - హీరో ఇద్దరిపై ఈ చీటింగ్ కేసు నమోదు చేసారు సీసీఎస్ పోలీస్ లు.