మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని చిత్రం విడుదల విషయంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ మార్చుకుంటూ వచ్చిన గని ఫైనల్ గా ఫిబ్రవరి 25 న వచ్చెయ్యడానికి సర్వం సిద్ధం చేసుకుంటే స్వయానా బాబాయే భీమ్లా నాయక్ తో అడ్డం పడ్డాడు. దాంతో మళ్ళీ ఆగక తప్పలేదు వరుణ్ తేజ్ కి.!
నిజానికి హీరోగా కెరీర్ స్టార్ట్ చేసాక వరుణ్ ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా గని. బాక్సింగ్ నేపథ్య కథాంశం కావడంతో తీవ్రంగా శ్రమించి సాధించిన శారీరక ధారుడ్యంతో బాక్సర్ గా తెరపై కనిపించేందుకు రెడీ అయ్యాడు వరుణ్ తేజ్. కన్నడ హీరో ఉపేంద్ర, సీనియర్ హీరో జగపతిబాబు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం కానున్నారు. అలాగే అల్లు అరవింద్ తనయుడైన అల్లు బాబీ కూడా ఇదే చిత్రంతో తొలిసారి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అందుకేనేమో.. అన్నిసార్లు వాయిదా పడుతూ వచ్చిన గని విడుదల తేదీ సరిగ్గా అల్లు అర్జున్ పుట్టిన రోజుకి సెట్టయింది.
ఎస్... బన్నీ బర్త్ డే అయిన ఏప్రిల్ 8 న గని చిత్రంతో వరుణ్ వస్తాడంటూ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. సో.. గని సక్సెస్ కోసం ఐకాన్ స్టార్ బ్లెస్సింగ్స్ మెగా ప్రిన్స్ తీసుకుంటాడనీ.. తన అన్నకి నిర్మాతగా వచ్చే తొలి విజయాన్ని వరుణ్ ఇచ్చిన గిఫ్ట్ గా అల్లు అర్జున్ అందుకుంటాడనీ ఆశిద్దాం.