భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా హాజరై కార్యక్రమం చివరి వరకూ ఉత్సాహంగా గడపడంతో బాటు చాలా హుందాగా వ్యవహరించారు కేటీఆర్. ఎటువంటి విమర్శలకు, వివాదాలకు తావు లేని రీతిలో స్పష్టంగా క్లుప్తంగా సాగిన కేటీఆర్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తెలుగు సినీ పరిశ్రమకి టీఆరేస్ ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని మరోసారి భరోసానిస్తూ.. టాలీవుడ్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రాచుర్యానికి తోడ్పడాలని సముచిత రీతిలో ఆకాక్షించారు కేటీఆర్. ముఖ్యంగా ఆ ఈవెంట్ లో ఇటీవలే పద్మశ్రీ అందుకున్న తెలంగాణ సంప్రదాయ సంగీతకారుడు కిన్నెర మొగిలయ్య, మంచిర్యాలకు చెందిన గాయని కుమ్మరి దుర్గవ్వ, నల్గొండ నుంచి వచ్చిన దర్శకుడు సాగర్ కె చంద్ర వంటి వాళ్ళు కేటీఆర్ ప్రత్యేక అభిమానాన్ని చవిచూశారు. అలాగే పవన్ కళ్యాణ్ పట్ల సోదర భావాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్ తమ కలయికకు రాజకీయ రంగు అంటకుండా జాగ్రత్త పడ్డారు.
ఇక మరో విశేషం ఏమిటంటే.. నిన్న రాత్రి భీమ్లా వేడుకలో పాల్గొన్న కేటీఆర్ నేటి ఉదయం కూడా ఆ అంశంపై స్పందిస్తూ ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్ ని గ్రీట్ చేసేందుకై తన రొటీన్ కార్యక్రమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి భీమ్లా నాయక్ ఈవెంట్ కి అటెండ్ అయ్యాననీ, అక్కడ పలువురు ప్రతిభావంతులైన కళాకారులను కలవడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందనీ అంటూ కొన్ని ఫోటోగ్రాఫ్స్ ని కూడా షేర్ చేసారు కేటీఆర్. మొత్తానికి బేసిక్ గానే మూవీ లవర్ అయిన ఈ యువ నాయకుడు భీమ్లా కి బాగానే కనెక్ట్ అయినట్టు అనిపిస్తోంది ఇదంతా చూస్తోంటే..!
అన్నట్టు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సైతం నిన్న తాను భీమ్లా ఈవెంట్ లో పాలుపంచుకున్న దృశ్యాలను నేడు ట్వీట్ లో షేర్ చేయడం గమనార్హం.