సితార ఎంటర్ టైన్మెంట్స్ బేనరుపై పలు చిత్రాలు చేసినప్పటికీ భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ గానే బాగా పాపులర్ అయ్యారు నాగ వంశీ. సోషల్ మీడియాలో అభిమానుల స్పందన గమనిస్తూ, అందుకు అనుగుణమైన అప్ డేట్స్ ఇస్తూ పవర్ స్టార్ ఫ్యాన్సుతో బ్రో అనీ, అన్నా అనీ, మావా అనీ చాలా చనువుగా పిలిపించేసుకుంటోన్న నాగ వంశీ అదే తరహా మాట తీరు వాడడం వల్ల లేనిపోని వివాదం కొని తెచ్చుకుని క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరాన్ని సృష్టించుకున్నారు. ఇంతకీ అసలేమైందంటే....
నిర్మాతగా ఇటీవలే డీజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగ వంశీ సదరు సినిమా మీడియా మీట్ లో మాట్లాడుతూ 150 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కునే ప్రేక్షకుడికి ఏం కావాలో, వాడేం కోరుకుంటాడో అంతకు పదింతల ఎంటర్టైన్ మెంట్ మేము ఇచ్చాం అంటూ ఉత్సాహంగా చెప్పుకొచ్చారు.
అయితే అవసరం ఉన్నప్పుడు ప్రేక్షక దేవుళ్లు అనీ.. అనుకున్న రిజల్ట్ వచ్చాక అదే ప్రేక్షకులని వాడు వీడు అంటూ చులకన చేయడం ఏమిటనే విమర్శలు సామజిక మాధ్యమాల్లో గట్టిగానే స్ప్రెడ్ అయ్యాయి. మరీ అంశం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల దృష్టికి వెళ్లిందో.. లేక చినబాబు చిన్నగా మందలించారో, కాక భీమ్లా నాయక్ రిలీజుకి ముందు ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకూడదు అనుకున్నారో... మొత్తానికి కొంతసేపటి క్రితం నాగ వంశీ తన వ్యాఖ్యలపై ట్విట్టర్ లో సారీ చెప్పారు. ప్రేక్షకులను తన సోదరులుగా భావించే అలా అన్నానని వివరణ ఇచ్చారు. ఫైనల్ గా ఆడియన్స్ అంటే ఎంతో గౌరవం అనీ, వాళ్ళే తమ బలం అనీ ముక్తాయింపు పలికారు.