లాస్ట్ ఇయర్ క్యాచ్ చేసిన క్రాక్ హిట్ తో ట్రాక్ లోకి వచ్చేసాడు అనుకుంటే ఈ ఇయర్ ఖిలాడీ తో ఆ క్రేజ్ ని కిల్ చేసేసుకున్నాడు రవితేజ. తను కోరుకునే పారితోషికం ఇస్తే చాలు.. ఎవరితో అయినా ఏ సినిమా అయినా చేసి పడేస్తాడనే నింద నిజమేనేమో అనిపించేలా చేసింది ఖిలాడీ సినిమా. అ చిత్రం నుంచి వరసగా విడుదలైన పాటలు పర్లేదు అనిపించుకున్నాయి. రిలీజ్ కి ముందే డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కోటి రూపాయల కార్ గిఫ్ట్ ఇచ్చేయడం, సేమ్ డేట్ కే తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ అనడం వంటి వార్తలు కాస్త ఆసక్తిని కలిగించాయి. అయితే అవేవీ ఖిలాడీకి ఆశించిన స్థాయిలో ఆరంభ వసూళ్లను అందించకపోవడం గమనార్హం. తొలి రోజున కేవలం నాలుగున్నర కోట్లే రాబట్టిన ఖిలాడీ మలి రోజున మూడు కోట్లతో సరిపెట్టుకున్నాడు. మూడో రోజైన ఆదివారం మరో మూడున్నర వరకూ వస్తుందని ట్రేడ్ ఎస్టిమేషన్. ఫస్ట్ వీకెండ్ లో వచ్చే ఈ 11 కోట్లనీ పక్కన పెడితే మరో 12 కోట్లు కావాలి ఖిలాడీ బ్రేక్ ఈవెన్ కి.! ఆ ఆశలు ఉండేనా ఊడేనా అనేది మండే రెవెన్యూ డిసైడ్ చేస్తుంది. దాంతో ఖిలాడీ రిజల్ట్ డిక్లేర్ అయిపోతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో పూర్తిగా చతికిలపడ్డ ఖిలాడీ డీజె టిల్లుకి దారిచ్చేసిందని చెప్పాలి. ఖిలాడీ ప్రీమియర్స్ కి కేవలం $29 ,903 వస్తే.. డీజె టిల్లు $107 ,267 తో ఓపెన్ అయి ఓ రేంజ్ లో దూసుకెళుతోంది.
ఇంతకీ ఇంత బ్యాడ్ రిసెప్షన్ కి కారణం ఏమిటి.? రవితేజ సినిమాకి రావాల్సిన హైప్ రాలేదెందుకని.? హీరో-డైరెక్టర్ మధ్య వచ్చిన విబేధాలు వార్తలకెక్కడమే కారణమా.? ఇంతటి హై బడ్జెట్ ప్రాజెక్టుని డైరెక్టర్ కరెక్టుగా హ్యాండిల్ చేయకపోవడమా.? ప్రొడ్యూసర్ కి సరైన అవగాహన లేకపోవడమా.. వగైరా వగైరా వంకలన్నీ పక్కన పెట్టేస్తే తప్పు ఎక్కడ జరిగినా నొప్పి మాత్రం రవితేజకే. అందులో సందేహం లేదు.
క్రాక్ సక్సెస్ ని క్యాష్ చేసుకుంటూ ఖిలాడీ మంచి రేట్లకి అమ్ముడుపోయింది. నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా భారీగానే వచ్చాయి. అయితే ఇప్పుడీ ఖిలాడీ ఎఫెక్ట్ మాత్రం రాబోయే రవితేజ సినిమాలపై పడనుంది. రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వర్రావు అంటూ వరుసగా సినిమాలను లైన్లో పెట్టుకున్న రవితేజకు రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా నెక్స్ట్ రిలీజ్ గా రానుంది. మరీ ఖిలాడీ దెబ్బకి రామారావుకి ఎలాగూ బిజినెస్ వైజ్ కాస్త తలనొప్పి తప్పదు. కానీ సినిమా బాగుంటే రవితేజ బౌన్స్ బ్యాక్ అవడం చూస్తాం. లేకుంటే మాస్ మహారాజ్ మళ్ళీ మునుపటి బ్యాడ్ ఫేజ్ పేస్ చెయ్యాల్సి వస్తుందేమో.!