ఈ రోజు ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. చిరు, ప్రభాస్, మహేష్ తదితరులు జగన్ తో సినిమా ఇండస్ట్రీ సమస్యలపై చర్చించి తర్వాత మీడియా సమావేశంలో సీఎం జగన్ కి కృతఙ్ఞతలు తెలియజేసారు. అయితే జగన్ మోహన్ రెడ్డి తో సినీ ప్రముఖులు ఏం చర్చించారో, ఆయన సినిమా పరిశ్రమకి ఇచ్చిన హామీలేమిటో.. జగన్ గారి మాటల్లో.. ఒక మంచి పాలసీ ద్వారా చిన్న, పెద్ద సినిమాలకి న్యాయం చెయ్యాలని ఒక కమిటీని ఏర్పాటు చెయ్యగా.. ఆ కమిటీ తరుచూ సమావేశం అవుతూ సినిమా ఇండస్ట్రీ సమస్యలపై దృష్టి పెట్టింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికతో పాటుగా.. సినిమా ఇండస్ట్రీ సమస్యలు తెలుసుకోవడానికి ప్రముఖులని ఆహ్వానించామని చెప్పారు జగన్.
హీరో, హీరోయిన్స్, డైరెక్టర్ పారితోషకాలు మినహాయించి.. 100 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసే వారికీ ఏపీ ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. చిన్న, పెద్ద సినిమాలకు ఒకే రకమయిన టికెట్ రేట్స్ తో న్యాయం చెయ్యడం. టికెట్ రేట్స్ పెంచడం జరిగింది. ఆ ధర అందరికి ఆమోదయోగ్యంగానే ఉంటుంది. 100 కోట్ల బడ్జెట్ సినిమాలకు ఓ వారం పాటు ప్రత్యేక ధరలను పెట్టాలి. అలాగే ఏపీలో 20 శాతం షూటింగ్స్ చేసేందుకు ఒప్పుకున్నారు. ఐదో షోను కూడా తీసుకురావాలని అడిగారు. సినిమా శుక్రవారం, శనివారం, ఆదివారం.. ఆ తర్వాత వారం ఆడగలిగితే సూపర్‌హిట్ అవుతుంది. అందుకే ఒప్పుకున్నాం. చిన్న సినిమాలకు అవే రేట్లు వర్తిస్తాయి. ఐదో ఆట వల్ల ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుంది.
సినిమా పరిశ్రమ కూడా విశాఖకు రావాలి. అక్కడ సినిమా వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తాము. తెలంగాణాతో పోలిస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోంది. ఆదయ పరంగా ఏపీ నుండే ఎక్కువగా వస్తుంది. స్టూడియోలు పెట్టేందుకు ఆశక్తి చూపిస్తే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తాం. మనం ఎప్పటికైనా విశాఖకు వెళ్లాల్సిందే చైన్నె, బెంగుళూరు, హైదరాబాద్‌లతో విశాఖపట్నం పోటీపడగలదు. రాజమౌళి లాంటి వారు పెద్ద సినిమాలు చెయ్యాలి. చిన్న సినిమాలని రక్షించుకోవాలి..చిన్న సినిమాలను పెద్ద సినిమాలతో పాటుగా రిలీజ్ చేసేందుకు కాస్త సమతుల్యత పాటించేందుకు ముందడుగు వెయ్యాలి అని సీఎం జగన్.. టాలీవుడ్ ప్రముఖులతో జరిగిన భేటీ విషయాలను మీడియాకి వివరించారు.