రాష్ట్రంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నా, రాజకీయంగా ఎందరు ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నా ఎప్పుడో తానింక పెదవి విప్పక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తూ ఉంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక అంశాలంటే మాత్రం ఆయనకు ఎక్కువ మక్కువని చెప్పాలి. చాతుర్మాస దీక్ష వంటివి చేయడానికి, కోటి దీపోత్సవం వంటి వేడుకలకు హాజరవడానికి ఆయన అత్యంత ఉత్సాహం చూపిస్తూ ఉంటారు.
ఇటీవలే హైదరాబాద్ లో ఆవిష్కృతమైన రామానుజాచార్యుల సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించి, చినజీయర్ స్వామిని కలిసి ఆ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న పవన్ మళ్ళీ రెండు రోజులు తిరక్కుండానే మహావతార్ బాబాజీ స్పూర్తితో వెలసిన తదేకం ఫౌండేషన్ సేవలను ప్రశంసిస్తూ తన స్టైల్ లో వీడియో బైట్ వదిలారు. అందులో నౌషీర్ గురూజీ స్థాపించిన తదేకం ఫౌండేషన్ ఊరూరా విస్తరిస్తూ చేస్తోన్న సేవలను ఆయన ప్రశంసించారు. తమ జన సైనికులతో పాటు అందరూ ఆ సంస్థకు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు.
ఇలా మంచి పనులను నిర్వహించే సేవా సంస్థలకు అభినందనలు తెలపడం, అండగా నిలబడడం ఖచ్చితంగా మెచ్చుకునే అంశమే కానీ మిగిలిన అన్ని విషయాల పట్ల కూడా జనసేనాని సత్వరం స్పందిస్తుంటే... తరచుగా జనానికి కనిపిస్తుంటే పార్టీకి ప్రయోజనం ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు.