ఈ రోజు తిరుపతిలో ఓ కార్యక్రమానికి హాజరైన ప్రస్తుత మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు యధాలాపంగా ఏదో మాట్లాడేశారు. కొందరు దాన్ని కాంట్రవర్సీ చేసేసే పనిలో పడిపోయారు. నిజానికి మంచు విష్ణు మాటల్లో ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ పై, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పై గౌరవమే వ్యక్తమైంది. ఒక్క చిరంజీవి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ ని కలవడం పట్ల మాత్రం అది వారి వ్యక్తిగత సమావేశం అయుండొచ్చు అనే అభిప్రాయం బయటికొచ్చింది.
తను ఏ ఉద్దేశంతో అలా స్పందించినప్పటికీ, చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా మంచు ఫ్యామిలీ అంగీకరించట్లేదనే కామెంట్స్ ఉన్నప్పటికీ మంచు విష్ణు మాటల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే సాక్షాత్తు సీఎం జగన్ నుంచే మళ్ళీ చిరంజీవికి ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 10 న మరోమారు ముఖ్యమంత్రితో చిరంజీవి భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఈ మీటింగ్ తో అందరి అనుమానాలు పటాపంచలు అవుతాయని, అన్ని సమస్యలకు అర్థవంతమైన పరిష్కారం దొరుకుతుందని విశ్లేషకుల అభిప్రాయం. బహుశా ఈ లేటెస్ట్ అప్ డేట్ తెలియక విష్ణు లేనిపోని వివాదం కొని తెచ్చుకున్నారేమో.
ఆఫ్ కోర్స్... ఆయన అలా అనుకోవట్లేదులెండి. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి అడిగితే అది చాలా స్పోర్టివ్ గా తీసుకుంటూ నా గురించి ఇంతమంది మాట్లాడుతున్నారంటే నేను పాపులర్ అయినట్లేగా అని నవ్వేశారు మంచు విష్ణు.