రాజకీయ రంగంలోనే కాకుండా సినిమా రంగంలోనూ మీడియా సమావేశం అనగానే ఎదుటి వ్యక్తిని ఇరుకున పెట్టే ప్రశ్నలు అడిగెయ్యాలని అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు కొందరు పాత్రికేయులు.
అడ్డగోలు అంశాలన్నీ ప్రస్తావించడమే తమ విద్వత్తు అనుకుంటారు మరికొందరు విలేఖర్లు.
అలా విచక్షణ కోల్పోయిన ఓ విలేఖరి తీరు పట్ల నిన్న ఫిల్మ్ జర్నలిస్ట్ సర్కిల్ లో పెను దుమారం రేగింది. డి జె టిల్లు అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ ఒంటి మీది పుట్టు మచ్చలపై సంతోషం పత్రికకు చెందిన సురేష్ కొండేటి అడిగిన ప్రశ్న అత్యంత అసభ్యంగా ఉండడంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. సదరు సినిమా హీరో సిద్దు జొన్నలగడ్డ చాలా హుందాగా ఆ క్వశ్చన్ ని ఎవాయిడ్ చేసినప్పటికీ ఆ మాట అనిపించుకున్న హీరోయిన్ నేహా శెట్టి మాత్రం ట్విట్టర్ వేదికగా గట్టిగానే గడ్డి పెట్టింది. ఆమెతో పాటు జత కలిసిన నెటిజన్లు కూడా ఇదేం జర్నలిజం, ఇతనేం జర్నలిస్ట్ అంటూ గొంతు కలిపారు. ఇకపై ఇలాంటి సంఘటన రిపీట్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా అని ఓ వైపు పీఆర్వోలు చర్చలు మొదలుపెడితే... మరోవైపు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేసింది.
ఇంత జరుగుతున్నా, ఇంతమంది ఖండిస్తున్నా రొమాంటిక్ ఫిల్మ్ కనుకే రొమాంటిక్ క్వశ్చన్ అడిగానని, తనకి వేరే ఏ ఇతర ఇంటెన్షన్స్ లేవని అపాలజీ చెబుతూ ట్వీట్ వేసేసి సరిపెట్టేసాడు సదరు వివాదానికి కారణమైన విలేఖరి సురేష్ కొండేటి.
సరే.. తెలుగు సినీ పాత్రికేయుల సంఘం విచారించింది. ఖండించింది. కానీ ఇది సరిపోతుందా.?
విలువలు మరిచి, హద్దులు మీరి మాట్లాడేసే మైకాసురులని ఇది ఆపగలుగుతుందా..??