నేను శైలజ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తర్వాత చాలా తొందరగా స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది. కానీ మహానటి కీర్తి సురేష్ ని అందనంత ఎత్తులో కూర్చోబెట్టింది. మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ మరపురాని ముద్ర వేసింది. ఆ తర్వాతే కీర్తి సురేష్ కి లక్కు కలిసి రాలేదు. చేతినిండా సినిమాలే. కానీ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. స్టార్ హీరోల సినిమాల్లో కనిపించినా.. అమ్మడిని అదృష్టం పలకరించలేదు. దానితో హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ కి వచ్చేసింది. వరసగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి అంటూ హడావిడి చేసింది.
కరోనా కారణంగా పెంగ్విన్, మిస్ ఇండియా మూవీస్ ఓటిటి బాట పట్టాయి. ఆ రెండు సినిమా డిజాస్టర్ అయ్యాయి. ఇక గుడ్ లక్ సఖిని మాత్రం ఓటిటిలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదు.. థియేటర్స్ లోనే అని మడి కట్టుకుని కూర్చున్నారు నిర్మాతలు.
గుడ్ లక్ సఖి కేవలం టైటిల్ లోనే కనబడుతుంది కానీ.. ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి పడిన తంటాలు చూసిన వారు మహానటి సినిమాకి ఇన్ని కష్టాలా అన్నారు. ఎలాగో రిలీజ్ డేట్ ఇచ్చారు. ప్రమోషన్స్ నామ్ కా వాస్త్ అన్నట్టుగా ముగించేసి థియేటర్స్ లోకి గుడ్ లక్ సఖిని తెచ్చేసారు. మరి సినిమా చూసిన వాళ్ళు.. బాబోయ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష అంటున్నారు. గుడ్ లక్ సఖి అన్నారు.. అందులో గుడ్ ఎక్కడుంది అంటున్నారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కి గుడ్ లక్ సఖిలో ఏమి తెలియని ఓ అమ్మాయి ఎలా ఛాంపియన్ అయ్యిందన్నదే ఇంట్రస్టింగ్ ఎలిమెంట్. కానీ గుడ్ లక్ సఖిలో అది కనిపించదు. కథ సంగతి అటుంచి.. కీర్తి సురేష్ కేరెక్టర్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఇక కోచ్ గా జగపతి బాబు బావున్నా.. ఆ కేరెక్టర్ ని కానీ, అది పిన్ని శెట్టి కేరెక్టర్ ని హైలెట్ అవ్వనీయలేదు.
క్రిటిక్స్ కూడా గుడ్ లక్ సఖికి బాడ్ రివ్యూస్ ఇచ్చారు.
అసలు కీర్తి సురేష్ కి విమెన్ సెంట్రిక్ మూవీస్ అచ్చిరావని పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. ఇక కీర్తి సురేష్ తదుపరి హీరోయిన్ గా చెయ్యబోయే సర్కారు వారి పాట పై భారీ అంచనాలున్నాయి. మరోపక్క మెగాస్టార్ చిరుకి చెల్లిగా భోళా శంకర్ లోను కీర్తి సురేష్ నటిస్తుంది.