ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారి తీసింది. దీనిపై సినీ హీరోలు స్పందిస్తుంటే.. ఏపీ మంత్రులు కూడా తమదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు. ఏపీలో చాలా థియేటర్స్ పై రెవిన్యూ అధికారులు దాడులు చేస్తూ సీజ్ చేస్తున్నారు. దానితో ప్రభుత్వ నిర్ణయంతో తాము థియేటర్‌లను నడపలేమని పలువురు థియేటర్ యజమానులు స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలకు థియేటర్ యజమానులు, పంపిణీదారులు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. టికెట్ రేట్ల తగ్గింపు, అలాగే థియేటర్స్ పై రైడ్స్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకెళ్లేందుకు సమయాత్తమయ్యారు.
ఈ రెండు విషయాలను మంత్రి నాని ని కలిసి మాట్లాడేందుకు అప్పాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరగా.. మంత్రి పేర్ని నాని కేవలం డిస్ట్రిబ్యూటర్స్‌తో మాత్రమే మాట్లాడేందుకు ఓకే చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు 20మంది డిస్ట్రిబ్యూటర్లు మంత్రి నాని కలిసేందుకు అనుమతి లభించింది. ఈ మీటింగ్ లో సినిమా టికెట్ రేట్లపై పలువురు సినీ హీరోలు, నిర్మాతల వ్యాఖ్యలతో తాము ఇబ్బంది పడుతున్నట్లు థియేటర్ యజమానులు, పంపిణీదారులు నాని తో చర్చినున్నారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతో థియేటర్లు నడపలేమని, దీనిపై మరోసారి అలోచించి నిర్ణయం తీసుకోవాలని వారు మంత్రి నానిని కోరనున్నారు.