రాజమౌళి సినిమాని ఎంతగా కష్టపడి తెరకెక్కిస్తారో.. సినిమా రిలీజ్ చెయ్యడానికి ముందు ప్రమోషన్స్ విషయంలోనూ అంతే ప్రాణం పెడతారు. ఆర్.ఆర్.ఆర్ ని ఇద్దరి స్టార్స్ తో పాన్ ఇండియా మార్కెట్ కి పోటీ ఇచ్చేలా రాత్రి పగలు కష్టపడిన రాజమౌళి.. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో గత నెల రోజులుగా అంతే కష్టపడుతున్నారు. ప్రమోషన్స్ తోనే సినిమాకి హిట్ అందించే రాజమౌళిలా.. ఏ ఒక్క దర్శకనిర్మాత ప్రమోషన్స్ చెయ్యరు.. ఈ విషయంలో రాజమౌళి చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అలా చెప్పడంలో ఎలాంటి నామోషీ కానీ, నేర్చుకోవడంతో ఎలాంటి చిన్న తనం కానీ అనిపించదు. ఇక రాజమౌళి ఐదు భాషల్లో రిలీజ్ చెయ్యబోతున్న ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా తగ్గకపోయినా.. ముంబైలో అంటే హిందీ ప్రేక్షకులని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.
పాన్ ఇండియా మార్కెట్ లో అతిపెద్ద మార్కెట్ బాలీవుడ్ మార్కెట్ కావడంతో రాజమౌళి పూర్తి ఫోకస్ ని బాలీవుడ్ ఇండస్ట్రీపైనే పెట్టారు. అక్కడ సల్మాన్ ఖాన్ లాంటి బడా హీరోతో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అందరిలో క్యూరియాసిటీ కలిగించడమే కాదు.. అక్కడ టాప్ షోస్ అయిన బిగ్ బాస్ షో స్టేజ్ పైన, అలాగే అక్కడ ఫెమస్ అయిన.. కపిల్ శర్మ షో అంటూ ఏ చిన్న ప్లాట్ ఫామ్ ని వదలకుండా రాజమౌళి ముంబై ప్రేక్షకులని పడేసే పనిలో బిజీగా ఉన్నారు. కొన్ని రోజులుగా ముంబైలోనే తిష్ట వేసిన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ హిందీలో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని పరుగులు పెట్టించారు. ఇక మిగతా భాషల్లోనూ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ఓ రేంజ్ లోనే ప్రమోషన్స్ చేసారు.. అందులో ఎలాంటి సందేహము లేదు. కాకపోతే కొంచెం ఎక్కువగా హిందీలో చేసారు అంతే.