బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియా ఇప్పుడు ఒక బయోపిక్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ప్రముఖ మావోయిస్టు ఉద్యమ నాయకుడు కొండపల్లి సీతారామయ్య గారి భార్య కొండపల్లి కోటేశ్వరమ్మ గారి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం చేయనున్నట్టు తెలిసింది. కోటేశ్వరమ్మ గారు జీవిత చరిత్ర 'నిర్జన వారధి' అనే పుస్తకంగా రాసి పబ్లిష్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఆమె కమ్యూనిస్ట్ ఉద్యమం లో అప్పట్లో చాలా కీలక పాత్ర పోషించటమే కాకుండా ఒక రహస్య జీవితం కూడా గడిపారు. కొండపల్లి సీతారామయ్యగారితో విడిపోయాక, కోటేశ్వరమ్మ గారు తన స్వయం కృషితో, పట్టుదలతో చదువుకొని, వుద్యోగం సంపాదించి, తన మనుమరాళ్ళను కూడా ఉద్ధతిలోకి తీసుకు వచ్చారు. ఆమె జీవితం ఎంతోమందికి ప్రేరణగా కూడా నిలించింది.
సీతారామయ్య గారిని చేసుకున్నాక ఆమె ఎన్ని కష్టాలు అనుభవించిందో ఆ తరువాత కూడా చాలా కష్టాలు, గడ్డు సమస్యలు వచ్చిన కూడా, ధీరోదాత్తంగా ఎదుర్కొని నిలబడగలిగింది. అలంటి కోటేశ్వరమ్మ గారి జీవిత చరిత్రని ఆర్కా మీడియా వాళ్ళు సినిమాగా తీయటానికి సంకల్పించారు. కోటేశ్వరమ్మ గారు రాసిన ఆ పుస్తకం రైట్స్ ని సొంతం చేసుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులతో ఆర్కా వాళ్ళు మాట్లాడుతున్నట్టు భోగట్టా. కేర్ అఫ్ కంచరపాలెం దర్శకుడు మహి ఈ చిత్రానికి దర్శకుడుగా పని చేస్తారని తెలిసింది. స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ మొదలయిందని అయితే కోటేశ్వరమ్మ రోల్ కి ఎవరిని తీసుకుందాం అనే దానిమీద చర్చ ప్రస్తుతం జరుగుతోందని తెలిసింది. సాయి పల్లవి అయితే దీనికి సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నారు. కోటేశ్వరమ్మ గారి జీవితంలో ఎన్నో మలుపులు మరియు ఎంతో ఆసక్తికరమయిన సంఘటనలు వున్నాయి.