స్టార్ హీరోల అభిమానులు.. అభిమాన హీరోని చూసేందుకు ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటారో.. ఈ మధ్యన ఆ హీరోలతో సెల్ఫీలు దిగేందుకు అంతే ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ ఆసక్తి కాస్తా ప్రాణాల మీదకి వచ్చేలా తయారయ్యారు. అభిమానం ఉండొచ్చు మరీ ప్రాణాలు పోగొట్టుకునే అభిమానం అయితే ఉండొద్దు. ఇష్టమైన హీరోల కోసం వేల మైళ్ళు నడక, రాజమౌళి అన్నట్టు అన్నా మేము చచ్చిపోతాం అంటూ కేకలు వెయ్యడం వరకు ఓకె.. కానీ హీరో ల కోసం ప్రాణాలు పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు. ఈ మధ్యన హైదరాబాద్ లో రాజమౌళి ఇద్దరి హీరోలతో ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని తెలిసి.. ఆ ప్రెస్ మీట్ జరిగే ప్రదేశానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ కోకోల్లలుగా చేరుకొని సినీమాక్స్ లోని ఫర్నిచర్ ధ్వంశం చెయ్యడంతో.. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసినా.. అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ లు బందోబస్త్ ఏర్పాటు చేసి.. ఫాన్స్ ని కంట్రోల్ చెయ్యాల్సి వచ్చింది.
ఇక నిన్న సోమవారం అల్లు అర్జున్ ఫాన్స్ అదే రేంజ్ లో చేసిన రచ్చ సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడం కాదు, పోలీస్ లాఠీ ఛార్జ్ లో అభిమానులు గాయపడ్డారు. పుష్ప ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో ఫాన్స్ మీట్ పేరుతో అభిమానులకు ప్రత్యేకంగా ఫోటోలు కూడా దిగాలని అనుకున్నాడు.కానీ అల్లు అర్జున్ ఫాన్స్ వలన ఆ ప్లాన్స్ ఒక్కసారిగా తారుమారయ్యాయి. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో నిర్వాహకులు వారిని కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. ఫాన్స్ వెయిట్ చేసి చేసి ఓపిక నశించడంతో ఒక్కసారిగా గేట్లను బద్దలు కొట్టుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా కొన్ని అద్దాలు కూడా పగిలిపోవడంతో పలువురు గాయపడ్డారు. దానితో అక్కడ పరిస్థితి అదుపుతప్పింది అని గ్రహించిన పోలీసులు కూడా లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.
అభిమానులపై లాఠీ ఛార్జ్ విషయంలో అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఫ్యాన్స్ మీట్ ఈవెంట్‌లో నా అభిమానులు గాయపడిన దురదృష్టకర సంఘటన గురించి నాకు తెలిసింది. నా టీం అక్కడి పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తోంది. ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. మీ ప్రేమ మరియు అభిమానం నా అతిపెద్ద ఆస్తి.. అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్ గా ట్వీట్ చేసాడు. మరి హీరోల మీద పిచ్చ అభిమానం.. అభిమానుల ప్రాణాల మీదకి రావడం ఎప్పటికప్పుడు చూసినా.. ఈ అభిమానులు మాత్రం మారేలా కనిపించడం లేదు.